Begin typing your search above and press return to search.

ఇన్‌స్టా రీల్స్, పిల్లల ప్రచారం.. విజయ్ గెలుపునకు అసలు సీక్రెట్ ఇదే? స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ బాగా పనిచేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By:  Tupaki Political Desk   |   18 May 2026 3:16 PM IST
ఇన్‌స్టా రీల్స్, పిల్లల ప్రచారం.. విజయ్ గెలుపునకు అసలు సీక్రెట్ ఇదే? స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
X

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా టీవీకే గెలుపు వెనుక రహస్యాన్ని ఛేదించినట్లుగా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు, ఓటు హక్కు కూడా లేని పిల్లలను ఉపయోగించుకుని విజయ్ పక్కా వ్యూహంతో ఓట్లను కొల్లగొట్టిందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఈ సరికొత్త సోషల్ మీడియా ప్రచారంలో తమ పార్టీ వెనకబడిందని, సోషల్ మీడియాలో విజయ్ జోరును తాము పసిగట్టలేక ఓడిపోయామని స్టాలిన్ విశ్లేషించారు.

తమిళనాడులో సంచలన విజయం సాధించిన టీవీకే అధినేత, దళపతి విజయ్ సరికొత్త అధ్యాయం మొదలుపెట్టారు. పార్టీ పెట్టిన రెండేళ్లకే ఆయన పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రత్యర్థులకు ఇప్పటికీ అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు విడుదలైన ఎగ్జిట్ పోల్ అంచనాలకు అందనంతలా విజయ్ విజయం ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. ఇక ఫలితాలు వచ్చిన రెండు వారాల పాటు విజయం విజేత మారడానికి గల కారణాలు, డీఎంకే అధికారం కోల్పోవడానికి దారితీసిన పరిణామాలపై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా డీఎంకే సమావేశంలో తమ పార్టీ ఓడిపోవడానికి సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఒక కారణమంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

స్టాలిన్ అసలేమన్నారంటే?

ఎన్నికల ఓటమిపై డిఎమ్‌కే సమీక్షా సమావేశంలో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయ ఎన్నికల ప్రచార శైలి కంటే భిన్నంగా సరికొత్త డిజిటల్ వ్యూహం తమిళనాడులో పనిచేసిందని మాజీ సీఎం అంగీకరించారు. ‘సోషల్ మీడియాను, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ను వారు అత్యంత ప్రణాళికాబద్ధంగా వాడుకున్నారు. చిన్న పిల్లల ద్వారా ప్రచారం చేయించి, వారి ద్వారా ఇంట్లోని తల్లులను, పెద్దవాళ్లను ప్రభావితం చేయడంలో విజయ్ పార్టీ విజయం సాధించింది. ఈ వ్యూహాన్ని మేము ముందుగా అంచనా వేయలేకపోయాం’ అని స్టాలిన్ విశ్లేషించారు. అయితే, డిఎమ్‌కే ఎప్పుడూ ఓటములకు కుంగిపోయే పార్టీ కాదని, ఫీనిక్స్ పక్షిలా మళ్లీ లేస్తుందని ఆయన కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ బాగా పనిచేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయ్ కేవలం ఒక స్టార్ హీరోగానే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ వేదికగా యువతను విపరీతంగా ఆకట్టుకున్నారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలంగా లేకపోయినప్పటికీ, డిజిటల్ వేదికలపై సరికొత్త ‘వార్ రూమ్స్’ ద్వారా ప్రతి ఓటరుకూ రీచ్ అయ్యేలా విజయ్ వ్యూహం రచించి సక్సెస్ అయ్యారని అంటున్నారు. సోషల్ మీడియాలో పిల్లలతో విజయ్ డైలాగులు చెప్పడం, డ్యాన్స్‌లు చేయడం, తద్వారా ఆ కుటుంబాల్లోని మహిళా ఓటర్లను ఆకర్షించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో డీఎంకే ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలపై ప్రచారానికే పరిమితమైందని, సోషల్ మీడియాలో నయా ట్రెండ్‌కు అనుగుణంగా యువ ఓటర్లను రీచ్ కాలేకపోయిందని విశ్లేషిస్తున్నారు.