స్టాలిన్ చేతిలో నగదు రూ.10 వేలు! బండి, బంగారం కూడా లేవంట..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్తుల లెక్కలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఐదేళ్లుగా తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న స్టాలిన్ తన చేతిలో కేవలం రూ.10 వేల నగదు మాత్రమే ఉన్నట్లు చూపారు.
By: Tupaki Political Desk | 31 March 2026 2:03 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్తుల లెక్కలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఐదేళ్లుగా తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న స్టాలిన్ తన చేతిలో కేవలం రూ.10 వేల నగదు మాత్రమే ఉన్నట్లు చూపారు. ఇక స్టాలిన్ భార్య దుర్గ వద్ద కూడా కేవలం రూ.40 వేలు మాత్రమే ఉన్నట్లు చూపడంపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ జరుగుతోంది. ఎన్నికల సమయంలో నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరూ తమ ఆస్తులు, అప్పులు వెల్లడించాల్సివుంటుంది. తమిళ రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్న సీఎం స్టాలిన్ తన ఆస్తుల జాబితాలో వెల్లడించిన వివరాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ వద్ద కేవలం రూ.10 వేలు ఉన్నట్లు చూపడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. ఇక ఆయన వద్ద కారు, బంగారం వంటివేవీ లేవని ఎన్నికల అఫిడవిట్ లో స్పష్టం చేశారు. దీంతో స్టాలిన్ ఆస్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా స్టాలిన్ కుటుంబం తమిళ రాజకీయాలను శాసిస్తోంది. ఆయన తండ్రి కరుణానిధి సుమారు ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు వ్యాపారాల్లో కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ, కుటుంబ సభ్యులు సంపాదించిన ఆస్తులతో తనకు సంబంధం లేదని స్టాలిన్ తన ఎన్నికల అఫిడవిట్ లో స్పష్టం చేశారు. అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో చూపిన ఆస్తులు కన్నా తక్కువగా ఇప్పుడు చూపడం ఆశ్యర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. ఎమ్మెల్యేగా వస్తున్న జీతం, బ్యాంకుల్లో ఉన్న ఫిక్సడ్ డిపాజిట్ల ద్వారా లభించే వడ్డీ మాత్రమే తన ఆదాయ వనరులుగా స్టాలిన్ చూపారు. ఇక స్టాలిన్ కన్నా ఆయన భార్య పేరునే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్న సీఎం స్టాలిన్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. తనకు తన భార్యకు కలిపి సుమారు రూ.9 కోట్ల ఆస్తి ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ఆయనకు వ్యక్తిగతంగా చరాస్తులు రూ.3.30 కోట్లు, స్థిరాస్థులు రూ.2.95 కోట్లుగా వెల్లడించారు. స్టాలిన్ భార్య పేరున రూ.3.42 కోట్ల ఆస్తులను చూపారు. గత ఎన్నికల సమయంలో స్టాలిన్ పేరుతో రూ.8.88 కోట్లు చూపగా, ప్రస్తుతం ఆ ఆస్తుల విలువ తగ్గినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాలిన్ వద్ద వ్యక్తిగతంగా రూ.6.25 కోట్లు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే జీతం, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ, పుస్తకాల రాయల్టీ ద్వారా తనకు ఆదాయం లభిస్తుందని స్టాలిన్ తన అఫిడవిట్ లో స్పష్టం చేశారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయంగా రూ.30.54 లక్షలుగా చూపించారు. అదేసమయంలో ఎటువంటి బ్యాంక్ అప్పులు, ఇతర ఆర్థిక బాధ్యతలు లేవని స్పష్టతనిచ్చారు. కాగా, ఖరీదైన వాహనాలలో తిరిగే స్టాలిన్ వద్ద కారు లేకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే స్టాలిన్ వాడుతున్న కార్లు అన్నీ ప్రభుత్వం లేదా పార్టీ పేరుపై రిజిస్టర్ అయినవేనని చెబుతున్నారు.
కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్న టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు. పెరంబూరులో నామినేషన్ తోపాటు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన విజయ్ తన ఆస్తుల లెక్కలను వెల్లడించారు. తనకు రూ.603 కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఇందులో రూ.404 కోట్ల చరాస్తులు, రూ.198.62 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా రూ.21.81 కోట్ల ఆస్తి వచ్చిందని, భార్య సంగీత పేరుతో రూ.15 కోట్ల విలువైన స్థిరాస్థులు ఉన్నట్లు విజయ్ వివరించారు.
