అమెరికాకు మిథున్ రెడ్డి.. ఏసీబీ కోర్టు ఏం చెప్పిందంటే..?
లిక్కర్ స్కాంలో నిందితుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు లైన్ క్లియర్ అయింది.
By: Tupaki Political Desk | 18 Oct 2025 10:22 AM ISTలిక్కర్ స్కాంలో నిందితుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు లైన్ క్లియర్ అయింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనున్న పార్లమెంటు సభ్యుల బృందంలో మిథున్ రెడ్డికి కేంద్రం చోటు కల్పించింది. అయితే లిక్కర్ స్కాంలో నిందితుడు అయిన ఆయనపై ఏపీ సీఐడీ గతంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఇది మిథున్ రెడ్డి అమెరికా టూర్ కు అడ్డంకిగా మారడంతో ఆయన ఏసీబీ కోర్టు అనుమతి కోరారు. ఈ నెల 23న ఆయన అమెరికా వెళ్లాల్సివుండగా, ఏసీబీ కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పు వెలువరించింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతుండగా, మన దేశం నుంచి రెండు బృందాలను కేంద్రం పంపిస్తోంది. ఇందులో అన్నిపార్టీల ఎంపీలకు ప్రాతినిధ్యం కల్పించారు. తొలి బృందంలో టీడీపీ ఎంపీ శ్రీభరత్ వెళ్లారు. ఇక రెండో బృందంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చోటు కల్పించారు. అయితే లుక్ అవుట్ సర్క్యులర్ పెండింగులో ఉండటంతో ఆయన పర్యటనపై అనిశ్చిత ఏర్పడింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కొద్ది రోజుల క్రితం ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తి చేసిన ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కరరావు శుక్రవారం సాయంత్రం తీర్పు వెలువరించారు. ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనకు అనుమతిస్తూ కొన్ని షరతులు విధించారు.
కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 23 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి లభించింది. అయితే ఇందుకోసం ముందుగా ఆయన రూ.50 వేల చొప్పున రెండు జామీన్లు సమర్పించాల్సివుంటుంది. విమానం టికెట్ల ఫొటోస్టాట్ కాపీలు, న్యూయార్క్ లో ఎక్కడ బస చేయనున్నారనే వివరాలు, ఈమెయిల్, ఫొన్ నెంబర్లను కోర్టుకు తెలియజేయాలని స్పష్టం చేసింది. అదేవిధంగా అమెరికా నుంచి తిరిగి రాగానే ఆయన పాస్ పోర్టును సిట్ అధికారులకు తిరిగి అప్పగించాలని షరతులు విధించింది.
మరోవైపు మద్యం కేసులో ఇతర నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డితోపాటు నిందితులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెరుకూరి వెంకటేశ్ నాయుడు, బూనేటి చాణక్య, నవీన్, బాలాజీ కుమార్ కు వచ్చేనెల 24 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో నిందితులైన ఎంపీ మిథున్ రెడ్డికి గతంలోనే రెగ్యులర్ బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే.
