Begin typing your search above and press return to search.

మిధున్ రెడ్డి కార్ల జోరు...మండిన పుంగనూరు

వైసీపీకి చెందిన లోక్‌సభ పక్ష నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి తన కార్లతో భారీ కాన్వాయ్ గా వస్తూ సృష్టించిన భారీ అలజడితోనే పుంగనూరు మున్సిపల్ ఎన్నికల కేంద్రం వద్ద భగ్గుమంది అని పోలీసులు చెబుతున్నారు.

By:  Satya P   |   16 Oct 2026 11:36 PM IST
మిధున్ రెడ్డి కార్ల జోరు...మండిన పుంగనూరు
X

వైసీపీకి చెందిన లోక్‌సభ పక్ష నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి తన కార్లతో భారీ కాన్వాయ్ గా వస్తూ సృష్టించిన భారీ అలజడితోనే పుంగనూరు మున్సిపల్ ఎన్నికల కేంద్రం వద్ద భగ్గుమంది అని పోలీసులు చెబుతున్నారు. శుక్రవారం నుంచి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు రంగం సిద్ధం అయింది. దాంతో వైసీపీ టీడీపీ నామినేషన్లకు క్యూ కట్టారు. ఈ క్రమమో అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్న సమయంలో భారీ ఘర్షణ చోటుచేసుకుంది. అయితే ఇదంతా వైసీపీ ఎంపీ సృష్టించిన వీరంగం అని పోలీసులు చెబుతున్నారు.

భారీ కాన్వాయ్ తో వచ్చి :

మిధున్ రెడ్డి వంద మంది అనుచరులతో భారీ కాన్వాయ్ తో రావడంతోనే ఘర్షణ మొదలైంది అని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ చెప్పారు. నామినేషన్ కి అభ్యర్ధితో పాటు మరో ఇద్దరికి మాత్రమే ఎన్నికల కేంద్రం వద్ద అనుమతి ఉందని ఎస్పీ అంటున్నారు. అయితే వంద కిలోమీటర్ల దూరం నిబంధనలను కూడా ఎంపీ మిధున్ రెడ్డి అతిక్రమించారని ఎస్పీ పేర్కొంటున్నారు.అక్కడి గేట్లను సైతం మిధున్ రెడ్డి కార్లు ఢీ కొట్టాయని ఆయన చెప్పారు. దీంతో ఈ ఘటన మీద స్థానికుల తో పాటు టీడీపీ అభ్యర్ధులు కూడా నిరసన తెలిపారు అని ఎస్పీ చెప్పారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే పోలీసులు చెదరగొట్టారని ఎస్పీ వివరించారు. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన శిక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.

భారీ ఘర్షణతో :

ఇదిలా ఉంటే ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పుంగనూరు టౌన్ టీడీపీ అధ్యక్షుడు మధు రాయల్ తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు మిథున్ రెడ్డిని నామినేషన్ కేంద్రంలోని ఒక ప్రత్యేక గదిలోకి తరలించి రక్షణ కల్పించారు. అంతే కాదు పుంగనూరులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మొత్తం మీద చూస్తే తొలి రోజే భారీ ఘర్షణలతో నామినేషన్ల ఘట్టం మొదలైంది. దాంతో రాయలసీమలో ముందు ముందు ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయన్న చర్చ సాగుతోంది. పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్న చర్చ సాగుతోంది. సాఫీగా ఎన్నికలు జరిగేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటే స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తాయని అంటున్నారు.