Begin typing your search above and press return to search.

2018లో మిస్సింగ్.. ఇన్ స్టా రీల్ తో రెండో భార్యతో దొరికేశాడు

సోషల్ మీడియాతో సమాజంలో చోటు చేసుకుంటున్న సిత్రాలు.. పంచాయితీలు అన్నిఇన్ని కావు. కలలో కూడా ఊహించని పరిణామాలకే కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది సోషల్ మీడియా.

By:  Garuda Media   |   3 Sept 2025 11:00 AM IST
2018లో మిస్సింగ్.. ఇన్ స్టా రీల్ తో రెండో భార్యతో దొరికేశాడు
X

సోషల్ మీడియాతో సమాజంలో చోటు చేసుకుంటున్న సిత్రాలు.. పంచాయితీలు అన్నిఇన్ని కావు. కలలో కూడా ఊహించని పరిణామాలకే కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది సోషల్ మీడియా. ఆ కోవకే చెందిన ఉదంతంగా దీన్ని చెప్పాలి. పెళ్లైన ఏడాదికే భార్య గర్భవతిగా ఉన్న వేళలో మిస్సింగ్ అయిన భర్త కోసం సదరు భార్య చేయని ప్రయత్నం లేదు. అయినా.. అతగాడి ఆచూకీ లభించింది లేదు. కట్ చేస్తే.. తాజాగా ఇన్ స్టాలో పోస్టు చేసిన వీడియోలో రెండో భార్యతో కలిసి అతగాడి రీల్ తో భర్త భాగోతం బయటకు వచ్చింది. ఇంతకూ ఈ సిత్రమైన ఉదంతం ఎక్కడ చోటు చేసుకుందంటే?

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లా సండీలా పోలీస్ స్టేషన్ పరిధిలో షీలూ అనే మహిళకు జితేంద్ర అలియాస్ బబ్లూకు 2018లో పెళ్లైంది. వివాహమైన ఏడాదికి భార్య గర్భవతిగా ఉన్న వేళ.. భర్త బబ్లూ ఎటో వెళ్లిపోయాడు. దీంతో.. ఆమె పోలీస్ స్టేషన్ లో భర్త మిస్సింగ్ కేసు పెట్టింది. పోలీసులు మిస్ అయిన భర్త ఆచూకీని కనిపెట్టలేకపోయారు. కట్ చేస్తే.. తాజాగా భర్త ఆచూకీ ఇన్ స్టాలో పోస్టు చేసిన రీల్ ఆధారంగా దొరికేసింది.

మిస్ అయిన భర్త.. మరో మహిళతో సన్నిహితంగా ఉన్న విషయం బయటకు వచ్చింది. ఆరా తీస్తే.. ఆమె బబ్లూ రెండో భార్యగా తేలింది. రీల్ లో ఉన్న మహిళను పెళ్లాడి పంజాబ్ లోని లూధియానాలో కాపురం పెట్టిన వైనం వెలుగు చేసింది. రెండో భార్యతో ముచ్చట పడి చేసిన రీల్ తో అతగాడి భాగోతం బద్దలైంది. దీంతో తన భర్త చేసిన మోసంపై చీటింగ్ కేసు పెట్టింది. ఈ సారి మాత్రం పోలీసులు స్పందించి లూధియానాకు వెళ్లి బబ్లూను అరెస్టు చేసి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నారు. మొత్తానికి మిస్ అయిన భర్త ఏడేళ్ల తర్వాత ఇన్ స్టా రీల్ రెండో భార్యతో దొరికేసిన వైనం ఆసక్తికరంగా మారింది.