మెక్సికో భామకు థాయ్ అధికారి సారీ.. అందాల పోటీల్లో ఏం జరిగింది?
థాయ్ లాండ్ లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By: Raja Ch | 6 Nov 2025 1:41 PM ISTథాయ్ లాండ్ లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఆతిథ్య దేశానికి చెందిన ఓ అధికారికి, మెక్సికో భామకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం బహిరంగ క్షమాపణలకు, కన్నీటి పర్యంతాలకు దారితీసింది! వివాదం మొత్తం ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ కావడంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
అవును... మిస్ యూనివర్స్ పోటీ నిర్వాహకుడు తోటి పోటీదారుడి పట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ అనేక మంది మిస్ యూనివర్స్ పోటీదారులు వాకౌట్ చేసిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. మిస్ యూనివర్స్ ఆతిథ్య దేశం థాయిలాండ్ అధికారి ఒకరు ప్రీ-పేజెంట్ వేడుకలో మిస్ మెక్సికో ఫాతిమాను బహిరంగంగా తిట్టడంతో ఈ హైడ్రామా నెలకొంది!
అసలేం జరిగింది..?:
మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా మిస్ మెక్సికో ఫాతిమా బోష్ ఒక షూట్ కు హాజరుకాలేదట. దీనిపై ప్రశ్నించిన మిస్ యూనివర్స్ థాయిలాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్.. 'తెలివితక్కువ వ్యక్తి / మూర్ఖురాలు' అనే అర్థం వచ్చేలా ఆమెను నిందించారు! దీనిపై ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యింది.
ఇందులో భాగంగా.. మీరు మమ్మల్ని గౌరవించినట్లే మేము మిమ్మల్ని గౌరవిస్తాం.. ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. నా దేశ సంస్థతో మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి అని తీవ్రంగా స్పందించారు. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ లో వీరి మధ్య వాగ్వాదం సుమారు నాలుగు నిమిషాలపాటు జరిగింది!
ఈ సమయంలో ఫాతిమాకు మద్దతుగా ఆమెతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన పోటీదారులు వేదిక నుంచి వాకౌట్ చేశారు. తర్వాత ఆమె బయటకు వచ్చి తన అసహనాన్ని వెళ్లగక్కారు.
నవాత్ బహిరంగ క్షమాపణలు!:
ఈ ఘటనపై ఆ డైరెక్టర్ నవాత్ స్పందించారు. ఇందులో భాగంగా... తాను ఈ ఘటనకు సంబంధించి అందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను అని తెలిపారు. ఈ సమస్య ఎంత పెద్దదిగా మారుతుందో నాకు తెలియదు అని అతను భావోద్వేగానికి గురైనట్లు కనిపించాడు. ఇదే సమయంలో ఆమెను మూర్ఖురాలు అని పిలవలేదని, ఆమె వల్ల నష్టం కలిగిందని మాత్రమే అన్నట్లు వివరణ ఇచ్చారు!
మరోవైపు ఈ ఘటనపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ కూడా స్పందించింది. ఇందులో భాగంగా... ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
