ఇన్ స్టాలో జట్టు కట్టి.. ట్రాప్ హౌస్ 9ఎంఎం పార్టీకి 50 మంది మైనర్లు
హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఉదంతం తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక లాంటిది. పిల్లలు ఏం చేస్తున్నారన్న దానిపై ఒక కన్ను వేయాల్సిన అవసరాన్ని చెప్పేస్తుంది.
By: Garuda Media | 6 Oct 2025 9:51 AM ISTహైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఉదంతం తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక లాంటిది. పిల్లలు ఏం చేస్తున్నారన్న దానిపై ఒక కన్ను వేయాల్సిన అవసరాన్ని చెప్పేస్తుంది. వారి డైలీ లైఫ్ ను ఒక కంట కనిపెడుతూ ఉండాలన్న విషయాన్ని చెప్పే ఈ ఉదంతంలోకి వెళితే.. ముక్కు ముఖం తెలీని యాభై మంది.. ఇన్ స్టాలో ఒక పోస్టు చూసి మత్తుపార్టీకి వెళ్లటం.. పోలీసుల చేతికి చిక్కటం చూస్తే.. హైదరాబాద్ మహానగరంలో అసలేం జరుగుతుందన్న సందేహం కలుగక మానదు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
నగరానికి చెందిన ఒక డీజే ఇన్ స్టాలో ట్రాప్ హౌస్9ఎంఎం పేరుతో ఒక అకౌంట్ ను నిర్వహిస్తున్నాడు. మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటనలు గుప్పించాడు. అంతేకాదు.. తాము నిర్వహించేది మామూలు పార్టీ కాదని.. పార్టీకి వస్తే అంతులేని ఆనందం సొంతమని ఊరించాడు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలయ్యే ఈ పార్టీ రాత్రి పది గంటల వరకు సాగుతుందని పేర్కొన్నాడు.
అంతేకాదు.. ఈ పార్టీకి హాజరు కావాలంటే సింగిల్ అయితే రూ.1600, కపుల్ అయితే రూ.2800గా నిర్ణయించాడు. ఇన్ స్టాలో ఈ పోస్టు చూసిన పలువురు మైనర్లు పార్టీకి అటెండ్ అయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యాభై మంది మైనర్లు ఈ పార్టీకి హాజరయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగి.. తనిఖీలు చేపట్టారు. పోలీసులు వెళ్లేసరికి.. వారంతా మత్తులో జోగుతున్నారు.
వీరికి డ్ర*గ్స్ పరీక్ష చేపట్టగా ఇద్దరు గంజాయి సేవించినట్లుగా తేలింది. ఆరుగురు నిర్వాహకులు, ఆరు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీరిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ల తల్లిదండ్రులకు సమాచారం అందించి.. వివరాలు సేకరిస్తున్నారు. నగరంలో పార్టీ కల్చర్ మాటున ‘మత్తు’ ఎంత లోతుల్లోకి వెళ్లిపోయిందన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.
