మిన్నియాపాలిస్ మృత్యు ఘోష: భారత్, ట్రంప్ పేర్లు రాసుకున్న దుండగుడు
కాల్పులకు కొన్ని గంటల ముందు రాబిన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో రెండు వీడియోలు పోస్ట్ చేశాడు.
By: A.N.Kumar | 28 Aug 2025 12:02 PM ISTమిన్నసోటా రాష్ట్రం మిన్నియాపాలిస్‌లో జరిగిన కాల్పుల ఘటన అమెరికాను కుదిపేసింది. ఓ స్కూల్ వద్ద ప్రార్థనల్లో పాల్గొంటున్న చిన్నారులపై రాబిన్ వెస్ట్‌మన్ విచక్షణ రహితంగా కాల్పులు జరపగా 8, 10 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. వారిలో 14 మంది విద్యార్థులే ఉండటం విషాదకరం. రైఫిల్, షాట్‌గన్, పిస్టల్ వంటి ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించిన రాబిన్, అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
భయానక సందేశాలు
దుండగుడి తుపాకులపై రాసిన రాతలు అధికారులు విస్తుపోయేలా చేశాయి. “కిల్ ట్రంప్”, “న్యూక్ ఇండియా”, “ఇజ్రాయెల్ మస్ట్ ఫాల్”, “వేర్ ఈజ్ గాడ్?” వంటి సందేశాలు స్పష్టంగా కనిపించాయి. అంతేకాక, గతంలో స్కూల్ కాల్పులు జరిపిన ఇతర దుండగుల పేర్లు కూడా ఆయుధాలపై రాసుకున్నాడు. అదేవిధంగా, సిరిలిక్ లిపిలో (రష్యా, బల్గేరియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఉపయోగించే లిపి) రాసిన గూఢసందేశాలు కూడా లభించాయి.
-యూట్యూబ్‌లో వీడియోలు
కాల్పులకు కొన్ని గంటల ముందు రాబిన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో రెండు వీడియోలు పోస్ట్ చేశాడు. అందులో తుపాకులు, మ్యాగజైన్లు, రాసిన సందేశాలు కనిపించాయి. "ఇది నా కోసం.. అవసరమైతే ఉపయోగిస్తాను" అని చెప్పిన వీడియో కూడా లభించింది. రెండు జర్నల్స్ కూడా సిరిలిక్ లిపిలో రాసినట్లు అధికారులు గుర్తించారు. ఆ వీడియోలను ఇప్పటికే యూట్యూబ్ తొలగించగా, అవి ఏ ఉద్దేశంతో పోస్ట్ చేశాడనే దానిపై దర్యాప్తు ముమ్మరమైంది.
ఎఫ్‌బీఐ దర్యాప్తు
ఎఫ్‌బీఐ ఈ ఘటనను దేశీయ ఉగ్రవాదంగా పరిగణిస్తోంది. ముఖ్యంగా కేథలిక్స్‌పై ద్వేషపూరిత దాడి జరిపినట్లు అనుమానిస్తోంది. రాబిన్‌కి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేకపోవడం, చట్టబద్ధంగానే ఆయుధాలు కొనుగోలు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. విచారణలో భాగంగా అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉందని సమాచారం.
అధికారుల ఆందోళన
యూఎస్ హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్ట్రీ నోయెమ్ మాట్లాడుతూ “అతని ఆయుధాలపై రాసిన సందేశాలను బట్టి, తీవ్ర మానసిక సమస్యలు ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ స్థాయి హింస ఊహించలేనిది” అని అన్నారు. మిన్నియాపాలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఒహరా కూడా “ఇది అమాయక పిల్లలపై ఉద్దేశపూర్వక దాడి.. అమానుషం” అని వ్యాఖ్యానించారు.
-ట్రంప్ స్పందన
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల పట్ల గౌరవ సూచకంగా జాతీయ జెండాను సగం ఎగరేయాలని ఆదేశించారు.
- పెరుగుతున్న స్కూల్ కాల్పులు
ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమెరికాలో చోటుచేసుకున్న 146వ స్కూల్ కాల్పుల ఘటన ఇదే కావడం గమనార్హం. చిన్నారుల ప్రాణాలు బలికావడం, దుండగుడి భయానక సందేశాలు అమెరికా సమాజాన్ని కలవరపెడుతున్నాయి.
