మైనస్ 30 డిగ్రీల చలితో అమెరికన్ల నిరసన.. ఎందుకంత ఆగ్రహం?
ఈ వ్యవహారంపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ సైతం అసంత్రప్తిని వ్యక్తం చేస్తూ.. ట్రంప్ నేత్రత్వంలోని ప్రభుత్వం వలసదారులపై వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
By: Garuda Media | 25 Jan 2026 2:00 PM ISTరోజుకో మాటతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. విదేశాల్లోనే కాదు స్వదేశంలోనూ అయ్యగారి పాలనా నిర్ణయాలపై అమెరికన్లు పలువురు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అక్రమ వలసల్ని గుర్తించటం.. వారి మీద చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. ఆ పేరుతో ప్రదర్శించే దుర్మార్గం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అధికారుల తీరుతో అమాయక ప్రజల ప్రాణాలు పోతున్న వైనంపై అమెరికన్లు వేలాదిగా స్పందించారు. తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ మైనస్ 30 డిగ్రీల వణికించే చలలో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇమిగ్రేషన్ విధానాలపై అమెరికాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిన్ససోటా రాష్ట్ర రాజధాని మిన్నియాపొలిస్ లో గడిచిన కొద్దిరోజులుగా ఇమిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు అమెరికన్లు. నిరసన తెలుపుతున్న నిరసనకారులపై డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 51 ఏళ్ల వ్యక్తి మరణించారు. ఈ వైనం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.
ఈ వ్యవహారంపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ సైతం అసంత్రప్తిని వ్యక్తం చేస్తూ.. ట్రంప్ నేత్రత్వంలోని ప్రభుత్వం వలసదారులపై వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటన జరిగిన వెంటనే వైట్ హైస్ అధికారులతో తాను మాట్లాడానని.. వలసదారుల అణిచివేతను వెంటనే నిలిపివేయాలని కోరినట్లుగా ఎక్స్ లో పోస్టు పెట్టారు.
అదే సమయంలో ఇమిగ్రేషన్ అధికారులు కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న దానిపై స్పష్టత రాలేదు. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. ఈ నెల (జనవరి) 7న కూడా ఈ తరహా విషాద ఉదంతం చోటు చేసుకుంది. 37 ఏళ్ల రెనీగుడ్ అనే మహిళ ఇమిగ్రేషన్ అధికారులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకుంది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఉదంతంపై నిరసన తెలుపుతున్నారు.
తాజాగా ఈ నిరసనలు తెలుపుతున్న వారిపై కాల్పులు జరపటం.. ఒకరు మరణించటంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మైనస్ 30 డిగ్రీల దారుణ ఉష్ణోగ్రతల్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి కాల్పుల ఉదంతంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం ఆ దేశంలోని పలు రాష్ట్రాల్లోని వారిని ఆకర్షిస్తోంది. ఈ నిరసనలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
