అమెరికాలో ఆగని తూటాల గర్జన: నర్సును కాల్చి చంపిన ఐసీఈ ఏజెంట్లు! భగ్గుమన్న ప్రజలు
ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. అధికారుల వాదనలు అబద్ధమని, అలెక్స్ ఏ తప్పూ చేయలేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
By: A.N.Kumar | 25 Jan 2026 11:15 AM ISTఅమెరికాలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారుల దూకుడు మరో ప్రాణాన్ని బలితీసుకుంది. మిన్నియాపోలిస్‌కు చెందిన 37 ఏళ్ల ఐసీయూ నర్స్, అమెరికన్ పౌరుడు అలెక్స్ జెఫ్రీ ప్రెట్టీ ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో మరణించడం ఇప్పుడు ఆ దేశంలో కార్చిచ్చు రేపుతోంది. ఒకవైపు అధికారుల వాదనలు, మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో పరిస్థితి విషమించింది.
అసలేం జరిగింది?
శనివారం జరిగిన ఈ ఘటనలో ఫెడరల్ అధికారులు ఒక ఆపరేషన్ నిర్వహిస్తుండగా అలెక్స్ జెఫ్రీ వారి తూటాలకు బలయ్యాడు. అలెక్స్ తన వద్ద ఉన్న ఆయుధంతో అధికారుల వైపు దూసుకువచ్చాడని, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని ఐసీఈ ప్రతినిధులు చెబుతున్నారు. అలెక్స్ ఒక బాధ్యతాయుతమైన నర్సు అని, అతనికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని కుటుంబం వాదిస్తోంది. అతనికి చట్టబద్ధమైన గన్ లైసెన్స్ ఉన్నప్పటికీ, అతను అధికారులపై దాడి చేసే వ్యక్తి కాదని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
వైరల్ వీడియో.. మారుతున్న సమీకరణాలు
ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. అధికారుల వాదనలు అబద్ధమని, అలెక్స్ ఏ తప్పూ చేయలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో ఆధారంగానే వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
మూడు వారాల్లో రెండో ఘటన: భయానక వాతావరణం
మిన్నియాపోలిస్‌లో గత మూడు వారాల వ్యవధిలోనే ఇది రెండో ఫెడరల్ కాల్పుల ఘటన కావడం గమనార్హం. రెనీ నికోల్ గుడ్ (37) అనే మహిళను ఐసీఈ అధికారులు కాల్చి చంపారు. వరుసగా జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్లతో స్థానిక ప్రజల్లో ఫెడరల్ ఏజెంట్ల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రంగంలోకి ట్రంప్.. రాజకీయ రంగు పులుముకున్న ఘటన
ఈ సున్నితమైన అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల చర్యలను ఆయన సమర్థించారు. "అలెక్స్ వద్ద లోడ్ చేసిన గన్ ఉందని, అతను ఏజెంట్లపై దాడికి ప్రయత్నించాడని" ట్రంప్ పేర్కొన్నారు. డెమోక్రటిక్ నాయకులు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.
నిరసనలతో అట్టుడుకుతున్న మిన్నెసోటా
కఠినమైన చలిని కూడా లెక్కచేయకుండా వేలాది మంది నిరసనకారులు "ఐసీఈ గెట్ అవుట్" అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. నగరంలో శాంతిభద్రతలు కాపాడటం ప్రస్తుతం అధికారులకు సవాలుగా మారింది. అమెరికా పౌరులను ఇలా రోడ్లపై కాల్చి చంపడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఈ ఘటనపై పారదర్శకమైన విచారణ జరిపి, బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలి.
ఈ ఘటన అమెరికాలో ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలు తీరుపై పెను వివాదాన్ని రేపింది. ఒక సామాన్య నర్సు మరణం.. రాజకీయంగా సామాజికంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
