మంత్రుల ఇలాకా: ఈ నియోజకవర్గాలు టాప్ లేపుతున్నాయ్.. !
ఇక్కడి నుంచి మంత్రి అనగానే సత్యప్రసాద్ వరుస విజయాలు సాధించి ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు.
By: Garuda Media | 31 July 2025 5:00 AM ISTమంత్రుల్లో చాలామంది పరిస్థితి ఇరకాటంగా మారింది, పనితీరులో బాగున్నా చంద్రబాబు దగ్గర మంచి మార్కులు వేయించుకున్న కూడా నియోజకవర్గ స్థాయిలో మాత్రం మంత్రులకు సెగ తగులుతున్న విషయం తెలిసినదే, హోం మంత్రి వంగలపూడి అనితకు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో అంతర్గతంగా అసమ్మతి సెగలు తగులుతూనే ఉన్నాయి. అదేవిధంగా పెనుకొండలో మంత్రి సవిత కూడా సమస్యల సుడిలో చిక్కుకున్నారు,
అదేవిధంగా ధర్మవరంలో బిజెపి నాయకుడు మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది, తెనాలిలోనూ నాదెండ్ల మనోహర్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు, ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది మంత్రులు తమ తమ సొంత నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, కానీ, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం మంత్రులకు అసలు పోటీ లేకుండా పోవడం, అసలు వారిపై చిన్న విమర్శలు కూడా చేసేవారు కూడా లేకపోవడం వంటివి ఆశ్చర్యం అనిపించక మానవు. ఇట్లాంటి నియోజకవర్గంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండడం విశేషం.
ఇక్కడి నుంచి మంత్రి అనగానే సత్యప్రసాద్ వరుస విజయాలు సాధించి ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. రాజకీయంగా చూస్తే రేపల్లె కీలకమైన నియోజకవర్గమే. వైసీపీకి సంబంధించి ఒకప్పుడు బలమైన నాయకులు ఉండేవారు. మోపిదేవి వెంకటరమణ చక్రం తిప్పారు. కానీ, గత ఏడాది జరిగిన ఎన్నికల అనంతరం వ్యక్తిగత కారణాలతో రాజకీయ సమస్యలతో ఆయన రాజ్యసభ సీటు కూడా వదులుకొని టిడిపిలోకి చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో వైసిపి తరఫున బలమైన వాయిస్ వినిపించే నాయకులు లేకుండా పోయారు. ఇది మంత్రి అనగాని సత్యప్రసాద్ కు కలిసి వస్తున్న పరిణామం.
వాస్తవానికి స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉండడం, కష్టపడే నాయకుడిగా, ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా గతంలోనే ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. చాలామంది కూడా మంత్రి పేరును వారి ఇళ్లకు రాయించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ప్రజలతో మమేకమైన అనగానికి మంత్రి అయ్యాక కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి విమర్శలు లేకుండా నియోజకవర్గంలో ప్రశాంతంగా రాజకీయాల ముందుకు సాగుతూ ఉండటం విశేషం. అయితే వచ్చే ఎన్నికల నాటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందా మధ్యలో వైసిపి ఏదైనా వ్యూహం మార్చుకుని బలమైన నాయకుడు పంపిస్తుందా అనేది చూడాలి.
అప్పటివరకు అయితే అనగాని రాజకీయాలు నల్లేరుపై నడకని చెప్పాల్సి ఉంటుంది. ఇదే జాబితాలో మంగళగిరి నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ కూడా వైసీపీకి వాయిస్ లేదు. వైసీపీ తరఫున మాట్లాడే నాయకులు లేరు. దీంతో టీడీపీ రాజకీయాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంగా బలమైన ముద్ర వేసుకుంది. దీంతో ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షం అన్న మాట లేకుండా పోయింది. ఒకప్పుడు బలమైన నాయకుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తర్వాత కాలంలో పార్టీకి దూరమయ్యారు.
మళ్ళి గత ఎన్నికలకు ముందు తిరిగి వచ్చారు. దీంతో ఆయనను నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఓ రకంగా చెప్పాలంటే వైసిపి ఉంది అంటే ఉన్నట్టు, లేదు అంటే లేనట్టు గా మంగళగిరి రాజకీయాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులకు సెగతగులుతూ ఉంటే ఇలా ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రం మంత్రులకు తిరుగులేకుండా పోయింది అన్న వాదన బలంగా వినిపిస్తోంది.
