ములుగు జిల్లాకు ఏమైంది..? మంత్రి సీతక్క ఎందుకు ఆగ్రహించారు?
ఎస్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న తెలంగాణలోని ములుగు జిల్లా వ్యవహారంపై రాజకీయంగా అనేక ప్రచారాలు తెరమీదికి వచ్చాయి.
By: Garuda Media | 15 Jan 2026 12:59 AM ISTఎస్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న తెలంగాణలోని ములుగు జిల్లా వ్యవహారంపై రాజకీయంగా అనేక ప్రచారాలు తెరమీదికి వచ్చాయి. ఇక, దీనికి మరింత మసాలా జోడించిన యూట్యూబ్ చానెళ్లు.. ఈ ప్రచారాన్ని పీక్ లెవిల్‌కు తీసుకువెళ్లాయి. దీంతో ఇదే జిల్లాకు చెందిన మంత్రి సీతక్క ఫైరయ్యారు. యూట్యూబ్ చానెళ్లు సహా.. ములుగు జిల్లాపై ప్రచారం చేస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పద్ధతి కాదని ఆమె అన్నారు. అంతేకాదు.. జిల్లాపై విష ప్రచారం చేస్తున్న వారు.. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
అసలు ఏమైంది?
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జిల్లాలను విభజించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రెండు రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన కూడా జారీ చేశారు. జిల్లాల విభజనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని జిల్లాల విభజనకు సంబం ధించి తమకు సిఫారసులు చేస్తుందన్నారు. మొత్తంగా ఈ ప్రకటనతో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. దీనిపై జోరుగా చర్చలు కూడా జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ములుగు జిల్లాపై యూట్యూబ్ సహా.. కొందరు చోటా రాజకీయ నాయకులు ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లాల పునర్విభజనలో ములుగును ఎత్తేస్తున్నారని.. ఇకపై జిల్లా ఉండదని ఈ ప్రచారం సారాంశం. దీంతో ములుగు జిల్లాలోని పలు తండాల వాసులు అప్పుడే సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. నిరసనలకు రెడీ అవుతున్నారు. మరికొందరు మంత్రి సీతక్క నుకలిసి.. జిల్లాను కాపాడాలని విన్నవించారు. దీంతో విషయం అర్ధం చేసుకున్న మంత్రి.. తాజాగా స్పందించారు. ములుగు జిల్లా ఎక్కడికీ పోదని.. వ్యతిరేక ప్రచారాన్ని నమ్మొద్దని ఆమె స్పష్టం చేశారు.
ఇదేసమయంలో బీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. గతంలో అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేశారని.. అందుకే ఇప్పుడు మార్పు చేయాల్సి వస్తోందన్నారు. అయినప్పటికీ.. ములుగు జిల్లా కొనసాగుతుందన్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్న వారు ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ములుగు జిల్లా మరింత అభివృద్ధి చెందేందుకు తాను నిరంతరం కృషి చేస్తున్నట్టు మంత్రి వివరించారు.
