కొడాలి అరెస్టు ఎప్పుడంటే..? అమెరికాలో అసలు విషయం చెప్పిన లోకేశ్
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ మంత్రి కొడాలి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ కార్యకర్తలు చేస్తూ వస్తున్నారు.
By: Tupaki Political Desk | 7 Dec 2025 1:59 PM ISTగత కొద్దిరోజులుగా పెద్దగా ప్రస్తావన లేని మంత్రి లోకేశ్ ‘రెడ్ బుక్’పై అమెరికాలోని డల్లాస్ వేదికపై పెద్ద చర్చ జరిగింది. రెడ్ బుక్ లో రాసిన పేర్లపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారంటూ కొందరు అభిమానులు మంత్రి లోకేశ్ ను ప్రశ్నించారు. ఇదే సమయంలో మరో అభిమాని కొడాలి పేరు ప్రస్తావించారు. దీనికి స్పందించిన లోకేశ్ మాట్లాడుతూ, పేర్లు ఎందుకు? మీకు ఎలాండి డౌట్ వద్దు.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు... అంటూ తేల్చిచెప్పారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వారు చేసినట్లే మనం చేయకూడదు.. అలా చేస్తే 151 సీట్లు 11 అయిన పరిస్థితిని మనం గుర్తించుకోవాలని అన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రెడ్ బుక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను గతంలోనే చెప్పా ఎర్ర బుక్కు తన పనితాను చేసుకుపోతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరినీ వదిలిపెట్టం.. దాంట్లో ఎలాంటి డౌటు వద్దు. కానీ, వారు చేశారు, కనుక మనం చేయాలి అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎవరినీ వదిలిపెట్టం’’ అంటూ లోకేశ్ ఉద్ఘాటించారు. చట్టపరమైన నిర్ణయాలు, యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమయంలోనే ఓ అభిమాని కొడాలి.. కొడాలి అంటూ కేకలు వేయగా, లోకేశ్ ప్రతిస్పందిస్తూ పేర్లు అవసరమా, టైం వేస్ట్ భయ్యా... అంటూ ఓ రేంజ్ లో మాట్లాడారు. ‘‘నా తల్లిని అవమానిస్తే వదిలిపెడతానా.. మీ అమ్మను బాధపెట్టినా వదిలిపెట్టను. ఎందుకంటే తల్లిబాధ ఆవేదన తెలిసిన వాడిని, మా అమ్మ ఏ నాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ల నాన్న గారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి.. కానీ ఏ రోజు ఒక పోస్టింగు, కాంట్రాక్టు కోసం అడగలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీకు ఎలాంటి డౌట్ వద్దు’’ అలా అని వారు అవమానించారని మనం చేయకూడదు. మహిళలను అంతా గౌరవించాలి. మహిళలను గౌరవించే సమాజమే అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు.
ఇక లోకేశ్ తాజా వ్యాఖ్యలతో రెడ్ బుక్, కొడాలి అరెస్టుపై మరోమారు చర్చ మొదలైంది. గత ప్రభుత్వంలో టీడీపీని ముఖ్యంగా అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ ను టార్గెట్ గా చేసుకుని అప్పటి మంత్రి కొడాలి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ మరచిపోలేక పోతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అందుకే అమెరికాలో ఉన్నవారు సైతం కొడాలి అరెస్టు ఎప్పుడంటూ అడుగుతున్నారని అంటున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ మంత్రి కొడాలి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ కార్యకర్తలు చేస్తూ వస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత కొంత శాంతించినా, ఇప్పటికీ కొడాలిని అరెస్టు చేయకపోవడంపై తరచూ సోషల్ మీడియా వేదికగా పార్టీని ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికాలో సైతం లోకేశ్ కు ఇదే ప్రశ్న ఎదురవడంపై చర్చ జరుగుతోంది. కార్యకర్తల ఒత్తిడి మేరకు కొడాలి అరెస్టుకు లోకేశ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.
