హనుమాన్ ఆలయంలో ఎంపీ అసదుద్దీన్ పూజలు! అసలు నిజం తెలిస్తే షాక్
ఏఐ టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఎంఐఎం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
By: Tupaki Political Desk | 6 Dec 2025 8:22 PM ISTహైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హనుమాన్ ఆలయంలో అసదుద్దీన్ పూజలు చేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియోను చూసిన ఎంఐఎం నేతలు, కార్యకర్తల్లో కలకలం రేగింది. ఎంఐఎం వాట్సాప్ గ్రూపుల్లో ఆ వీడియోపై తీవ్ర చర్చ జరగడంతో ఎంపీ కార్యాలయం వెంటనే హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. హిందూ-ముస్లిం మతసామరస్యాన్ని కోరుకుంటూ రెండు వర్గాల వారు పరస్పరం గౌరవించుకోవడం, ఆలయాలను సందర్శించడం మంచిదే అయినప్పటికీ, అసదుద్దీన్ పై నకిలీ వీడియో తయారు చేసి సర్య్కులేట్ చేయడమే చర్చనీయాంశంగా మారింది.
ఏఐ టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఎంఐఎం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఓ ఆలయంలో హనుమాన్ విగ్రహానికి ఒవైసీ హారతి ఇస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. సమాజంలో మతపరమైన అశాంతిని సృష్టించే ఉద్దేశంతో ఈ కల్పిత వీడియోను వ్యాప్తి చేస్తున్నట్లు ఎంఐఎం వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరైనా ఏమరపాటుగా చూస్తే వీడియో నిజమనే అనిపించేలా తయారు చేశారు. ఎంపీ అసదుద్దీన్ తోపాటు పక్కన పూజారి, ఎంపీ అనుచరులు అంతా కలిసి హనుమాన్ విగ్రహానికి పూజలు చేస్తున్నట్లు ఆ వీడియోను రూపొందించారు. అయితే దీనిపై విచారణ జరపగా, అంతా ఫేక్ అని తేలింది. ఆధునిక సాంకేతిక ఉపయోగించి ఫ్యాబ్రికేట్ చేశారని పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో కెమెరా కోణంలో ఆకస్మికంగా మార్పు రావడం, ముఖ కవళికలు అసలు మారకపోవడం వంటి సాంకేతిక అంశాలు ఇది డీప్ ఫేక్ అని స్పష్టంగా అర్థమవుతోందని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి ఉద్దేశపూర్వకంగా అప్ లోడ్ చేశారన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ప్రజల్లో గందరగోళం, అశాంతి రేపడమే లక్ష్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నకిలీ వీడియోసర్క్యులేషన్ పై హైదరాబాద్ పోలీసులు ఐటీయాక్ట్ కింద కేసులు నమోదుచేశారు. నకిలీ వీడియోను సృష్టించిన వారితోపాటు వైరల్ చేసిన వారిపై చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తప్పుడు వీడియోలను షేర్ చేయొద్దని ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.
