Begin typing your search above and press return to search.

బీహార్ దంగ‌ల్‌: ఎంఐఎం కింగ్ మేక‌ర్ అవుతుందా?

హైదరాబాద్ కు చెందిన జాతీయ పార్టీ ఎంఐఎం బిహార్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. తాజాగా 110 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్టు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.

By:  Garuda Media   |   13 Oct 2025 12:32 PM IST
బీహార్ దంగ‌ల్‌:  ఎంఐఎం కింగ్ మేక‌ర్ అవుతుందా?
X

హైదరాబాద్ కు చెందిన జాతీయ పార్టీ ఎంఐఎం బిహార్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. తాజాగా 110 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్టు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అంతేకాదు.. తాము కింగ్ మేక‌ర్ అవుతామ‌ని కూడా వ్యాఖ్యానించారు. వాస్తవానికి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘ‌ట్ బంధ‌న్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని ఎంఐఎం ఆది నుంచి ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాఘ‌ట్ బంధ‌న్‌లో చేరడం ద్వారా ప్రస్తుతం ఉన్న బలాన్ని మరింత పెంచుకోవాలని భావించింది.

దీనికి ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడి కూడా అంగీకరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గింది. ఎంఐఎంకు అవకాశం ఇస్తే సంప్రదాయ హిందూ ఓట‌ర్లు తమకు దూరమవుతారని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంఐఎం నుంచి అనేక వినతులు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోలేదు. ఫలితంగా ఎంఐఎం ఇప్పుడు ఒంటరి పోరుకు సిద్ధమైంది. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో సీమాంచల్‌ ప్రాంతంలోని 47 అసెంబ్లీ స్థానాలు అత్యంత కీలకంగా మారాయి.

ఇవి మొత్తం నాలుగు జిల్లాల పరిధిలో ఉన్నాయి. గత 2020 ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలోనే నాలుగు స్థానాల్లో ఎంఐఎం పార్టీ విజయం దక్కించుకుంది. ఇప్పుడు పూర్తిస్థాయిలో దృష్టి సారించడం ద్వారా మరింత పట్టు పెంచుకోవడంతో పాటు రెండు అంకెల సంఖ్యలో తమ బలాన్ని పుంజుకునేలా చేయాలని అసదుద్దీన్ భావిస్తున్నారు. అయితే ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది పక్కన పెడితే ప్రధాన కూటమి పార్టీలైన ఆర్జెడి, కాంగ్రెస్‌కు మాత్రం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను తీసుకువస్తున్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట.

ఓటు బ్యాంకును చీలిస్తే ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దూరమై తద్వారా మహాఘ‌ట్‌బంధ‌న్ విజయాలకు కూడా పెద్ద ఎత్తున గండి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, తమకు మహాఘ‌ట్‌బంధ‌న్‌లో చోటు దక్కని కారణంగానే ఒంటరి పోరుకు సిద్ధమయ్యామ‌ని అసదుద్దీన్ చెప్తున్నారు. తాజాగా ఆయన 35 మందితో కూడిన జాబితాను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం 110 స్థానాలకు పోటీ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ రెండో దశ ఎన్నికలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.

రెండో దశలో మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది అన్నది ఎంఐఎం వర్గాలు చెబుతున్న మాట. బలమైన ముస్లిం మైనారిటీలలో ఎంఐఎం కు మద్దతు భారీగా ఉండడం, పోటీకి కూడా మెజారిటీ సంఖ్యలో అభ్యర్థులు రావడం వంటివి ఎంఐఎంకు కలిసి వస్తున్న పరిణామాలు. అయితే అంతిమంగా ఇది బిజెపి కన్నా కూడా కాంగ్రెస్కు నష్టం చేకూర్చే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.