రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోకి విదేశీయులు.. మాట విన్నా చావే.. వినకపోయినా చావే !
ఏ దేశమేగినా, ఎందు కాలెడినా తప్పని వేధింపులు, మోసాలు. వలస కార్మికుల బాధలు వర్ణణాతీతం. చరిత్రలో వీరు లేని అభివృద్ధి చెందిన దేశం లేదు.
By: A.N.Kumar | 29 Jan 2026 12:00 AM ISTఏ దేశమేగినా, ఎందు కాలెడినా తప్పని వేధింపులు, మోసాలు. వలస కార్మికుల బాధలు వర్ణణాతీతం. చరిత్రలో వీరు లేని అభివృద్ధి చెందిన దేశం లేదు. అభివృద్ధి చెందిన సమాజం లేదు. దశాబ్ధాలు గడిచినా వీరికి వేధింపులు తప్పడంలేదు. రూపం మారుతోంది కానీ అదే మోసం. అదే నయవంచన. మోసగాళ్లు మరొక మెట్టు ఎక్కారు. వలసకార్మికుల్ని యద్ధరంగంలో తోలుబొమ్మల్లా మార్చారు. బంగ్లాదేశ్ కు చెందిన మక్సూదుర్ రహమాన్ పొట్టిచేతపట్టుకుని రష్యా వెళ్లాడు. వెళ్లింది పారిశుద్ద కార్మికునిగా. కానీ అక్కడ దిగాక పంపింది యుద్ధరంగంలోకి. దిగి..దిగగానే రష్యా భాషలో ఉన్న పేపర్లో సంతకం చేయించుకున్నారు. తీరా తెలిశాక అది ఒప్పందం. యుద్ధరంగంలో పనిచేస్తామని ఒప్పుకున్న ఒప్పందం. కానీ తానొచ్చింది పారిశుద్ధ్య కార్మికునిగా అని చెప్పినా రష్యన్ అధికారులు ఒప్పుకోలేదు. ` మీ ఏజెంట్ మాకు మిమ్మల్ని అమ్మేశాడు. మేము కొనుక్కున్నాం. మేం చెప్పినట్టు చేయాలి. లేదంటే చంపేస్తాం, జైల్లో బంధిస్తాం` అని బెదిరించారు. యుద్ధరంగంలో డ్రోన్లను ఎలా ఉపయోగించాలి, సైనికులకు గాయాలు తగిలితే ఎలా వైద్యం చేయాలి, ఆయుధాల్ని ఎలా వినియోగించాలి లాంటి శిక్షణ ఇచ్చారు. ఈ విషయాలను రష్యా అధికారుల నుంచి తప్పించుకొన్న మక్సుదుర్ రహమాన్ వెల్లడించారు.
అప్పుడు ఇండియా.. ఇప్పుడు బంగ్లాదేశ్
ఉద్యోగాల పేరుతో భారత్, నేపాల్, ఇరాక్, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి పేద యువకుల్ని ఏజెంట్లు రష్యాకు అమ్మేస్తున్నారు. ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో వీరిని వాడుకుంటున్నారు. మాట వినని వారిని హింసిస్తున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు. జైల్లో వేస్తామని హెచ్చిరిస్తున్నారు. దీంతో కొందరు ఇష్టం లేకపోయినా యుద్ధరంగంలో భయంభయంతో పనిచేస్తున్నారు. సంపాదన దేవుడికెరుక.. ప్రాణం మిగిలితే చాలు అన్నట్టు వారి పరిస్థితి మారింది. సొంతూర్లో ఉపాధి లేక విదేశాలకు వెళ్లి సంపాదించాలన్న యువకుల కల పీడకలలా మారుతోంది. ఇదే విధంగా 2024లో ఇండియా నుంచి రష్యా చేతిలో చిక్కుకున్న 34 మంది యువకుల్ని భారత ప్రభుత్వం రష్యాతో మాట్లాడి వారి విడుదలకు సహకరించింది.
ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో విదేశీయులను రిక్రూట్ చేసుకుంటోంది. భారత్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల నుంచి ఉద్యోగాల పేరుతో మోసపోయిన వారిని బలవంతంగా యుద్ధ రంగంలోకి దింపుతోంది. నార్త్ కొరియా నుంచి రష్యాకు సహాయంగా సైనికుల్ని ఆ దేశం పంపింది. విదేశీయుల్ని నియమించుకోవడం రష్యాకు ఆర్థికంగా తలకు మించిన భారమవుతోంది. అదే సమయంలో సైనికుల డిమాండ్ పెరుగుతుండటంతో విదేశీ యువకుల్ని యుద్ధ రంగంలోకి దింపుతోంది. యుద్ధంలో చాలా మంది విదేశీయులు గాయపడుతున్నారు. ఉక్రెయిన్ చెరకు చిక్కుతున్నారు. మరణిస్తున్నారు. యుద్ధరంగంలో దిగిన విదేశీయులకు ఆయుధాలపై అవగాహన లేకపోవడం, శిక్షణ లేకపోవడం ప్రధాన సమస్య. అదే సమయంలో రష్యాలో నివసిస్తున్న విదేశీయులను శాశ్వత నివాస హామీతో యుద్ధరంగంలోకి దింపుతున్నారు. ఈ నియామకాల నేపథ్యంలో నేపాల్ రష్యా, ఉక్రెయిన్ కు వెళ్తున్న వారిని అడ్డుకుంటోంది.
