మూడున్నరేళ్లలో మొదటిసారి 100 డాలర్ల మార్క్ దాటేసింది
తాజాగా మొదలైన ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ఎదురవుతున్న సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
By: Garuda Media | 9 March 2026 10:33 AM ISTయుద్ధం ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు. యుద్ధంతో నేరుగా సంబంధం ఉన్న వారి తిప్పలు ఒకలా ఉంటే.. దాంతో ఏ మాత్రం సంబంధం లేని కోట్లాది మంది తీవ్ర అవస్థలకు గురవుతుంటారు. ఇటీవల కాలంలో పెరిగిన యుద్ధాలు ఒక ఎత్తు అయితే.. తాజాగా మొదలైన ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ఎదురవుతున్న సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. యుద్ధం మొదలై పది రోజులు కాలేదు. అప్పుడే కోట్లాది మంది ప్రజలతో పాటు.. ప్రపంచంలోని పలు దేశాలు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నాయి. తాజా పరిణామం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసేది.
గడిచిన మూడున్నరేళ్లలో ఎప్పుడూ లేనంతగా ముడిచమురు ధర బ్యారెల్ ఒక్కటి వంద డాలర్ల మార్క్ ను దాటేయటం. ఎంతవరకు వెళుతుందో అర్థం కానట్లుగా పరిస్థితులు మారాయి. మూడున్నరేళ్లలో ఇంతటి భారీ ధర నమోదు కావటం ఇదే తొలిసారి. అమెరికా చమురు ధరలకు బెంచ్ మార్క్ గా ఉండే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర రూ.106.22 డాలర్లు పలికింది. షాకింగ్ అంశం ఏమంటే.. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బ్యారెల్ ఒక్కొక్కటి 90.90 డాలర్లు ఉండగా.. రెండు రోజుల వ్యవధిలో 16 డాలర్ల మేరకు పెరిగిపోవటం గమనార్హం.
ఫిబ్రవరి 28న మొదలైన తాజా యుద్ధం.. ఇప్పుడు రెండో వారంలోకి అడుగు పెట్టింది. మరోవైపు పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి షిప్పింగ్ కు అంతరాయం కలుగుతోంది. మరోవైపుఇరాన్ తన అధీనంలో ఉండే హర్మూజ్ జలసంధించిన మూసేసింది. ఒకవేళ ముడిచమురు నౌకలు ఆ జలసంధిని దాటే ప్రయత్నం చేస్తే.. నిప్పు పెడతామని ప్రకటించటంతో.. అంత సాహసానికి ఎవరు చేయని పరిస్థితి. హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధనానికి జీవనాడి లాంటిది. ఇక్కడి నుంచే ప్రపంచం వాడే చమురులో ఐదో వంతు ఈ మార్గం నుంచి సరఫరా అవుతుంది. ఇప్పుడు ఈ రవాణాకు ఆటంకం ఏర్పడటంతో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ యుద్ధం మరింతకాలం కొనసాగితే రికార్డు స్థాయిలో 150 డాలర్ల వరకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అంచనా వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా.. తాజా పరిణామాలు భారత్ కు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? అన్నది మరో ప్రశ్న. దేశంలో వినియోగించే ముడిచమురు అత్యధికం దిగుమతుల ద్వారానే సమకూరే పరిస్థితి. దీంతో.. భారీగా పెరిగే ధరలు ఒకపక్క.. మరోవైపు రోజువారీ వినియోగానికి సంబంధించి కొరత ఏర్పడుతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వాదనలో అర్థం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ముడి చమురు.. రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్ బ్యారెళ్ల నిల్వలు ఉన్నట్లుగా కేంద్రం వెల్లడించింది.
దేశంలో పాతిక రోజులకు మాత్రమే సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయన్న ప్రచారం తప్పుగా తేల్చేసింది. సరఫరా వ్యవస్థలో ఉన్నవి రెండు నెలలకు సరిపోతాయని నివేదిక స్పష్టం చేసింది. దీంతో..యుద్దం కారణంగా ముడిచమురు కొరత వేధించదన్న విషయాన్ని కేంద్రం స్పష్టం చేసినట్లైంది. మన దేశ ముడిచమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులే తీరుస్తున్న పరిస్థితి.
తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్తతలు లేని ప్రాంతాల నుంచి మన దేశానికి చమురు దిగుమతులు పెంచుతున్నట్లుగా కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2025లో హర్ముజ జలసంధికి సంబంధం లేని సరఫరాల వాటా 60 శాతం కాగా.. పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాతి ఇది 70 శాతం పెరిగినట్లుగా వెల్లడించింది. పశ్చిమ ఆఫ్రికా.. లాటిన్ అమెరికా.. అమెరికా నుంచి చమురును మన దేశం దిగుమతి చేసుకుంటుందని.. యుద్ధం కారణంగా ముడి చమురు కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతం సముద్ర మార్గంలో 120 మిలియన్ బ్యారెళ్ల రష్యా ముడి చమురు ఉందని.. ఇందులో 15 మిలియన్ బ్యారెళ్లు మన తీరానికి సమీపంలో చేరుకోగా.. మరో 7 మిలియన్ బ్యారెళ్లు సింగపూర్ సమీపంలో ఉన్నట్లుగా వెల్లడించింది. మొత్తంంగా ముడి చమురు కొరత ప్రచారంలో నిజం లేదు. కాకుంటే.. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ముడిచమురుధరల ప్రభావం మాత్రం మన మీద ఉండే వీలుంది. కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న వేళ.. పెట్రోల్.. డీజిల్ ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుదన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
