ఇరాన్-ఇజ్రాయిల్ వార్ : ఏపీ ఎగుమతిదారులకు లాస్, ఎలా అంటే?
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయల్ కొనసాగిస్తున్న యుద్ధంతో ఏపీ రైతులు కుదేలవుతున్నారు.
By: Tupaki Political Desk | 10 March 2026 4:47 PM ISTఇరాన్ పై అమెరికా, ఇజ్రాయల్ కొనసాగిస్తున్న యుద్ధంతో ఏపీ రైతులు కుదేలవుతున్నారు. యుద్ధం కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతి కావాల్సిన ఆహారోత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు. ఒక్క ఏపీ మాత్రమే కాకుండా తెలంగాణ, హరియాణా, కర్ణాటక, పంచాబ్, మహారాష్ట్రకు చెందిన రైతులు కూడా నష్టపోతున్నారని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి రొయ్యలు, బియ్యం పెద్ద ఎత్తున పశ్చిమాసియాకు ఎగుమతి చేస్తుంటారు. అదేవిధంగా పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం ఉత్పత్తులు సైతం ఆయా రాష్ట్రాల నుంచి ఎగుమతి అవుతుంటాయి. యుద్ధంతో హోర్ముజ్ జలసంధి మూసివేయడంతో పోర్టుల్లో సరుకు పేరుకుపోయిందని అంటున్నారు.
మన దేశ మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో ఐదు వంతు పశ్చిమాసియా దేశాలకు వెళుతోందని చెబుతున్నారు. గత ఏడాది పశ్చిమాసియా దేశాలకు భారత్ నుంచి ఒక లక్షా 8 వేల 898 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇందులో దాదాపు 40 వేల కోట్ల రూపాయల విలువైన బియ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హర్మోజ్ జలసంధి మూసివేయడంతో ఆ మార్గం గుండా సరుకు రవాణా చేసే నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మన దేశంలోని పోర్టుల్లో 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం నిల్వలు పేరుకుపోయినట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా కొన్ని నౌకలు నడి సంద్రంలో ఉండిపోయాయి. యుద్ధం మరికొంతకాలం కొనసాగితే నౌకల్లో ఉన్న రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు పాడయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఉత్పత్తి చేసే బాస్మతి బియ్యం ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. యుద్ధం వల్ల ఆ దేశాలకు బాస్మతి బియ్యం ఎగుమతి సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ మార్కెట్లకు ఆ సరుకును తరలించే అవకాశం కనిపించడం లేదు. దీంతో స్థానికంగా ధరలు పతనమయ్యే ప్రమాదంతోపాటు రైతులకు కనీసం పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధం వల్ల మన దేశం నుంచి దుబాయ్, ఇతర అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యే పండ్లు, మాంసం ఉత్పత్తులు, గుడ్లు, పాలు వంటి ఎగుమతులు నిలిచిపోయాయని అంటున్నారు. యుద్ధం ప్రారంభం కాకముందు నుంచే ఉద్రిక్తతల కారణంగా ఎగుమతులు 50 శాతం క్లీణించాయి. యుద్ధం మొదలైన తర్వాత ఇవి పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పండ్లు, గుడ్లు, మాంసం ఉత్పత్తుల ధరలు పతనమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది.
రంజాన్ వేళ.. ఎగుమతుల్లో స్తబ్దత
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న మాంసం, రొయ్యలు, పండ్లు, కూరగాయలు గల్ఫ్ దేశాలకు నిలిచిపోయాయి. దీంతో ఆయా దేశాల్లో రంజాన్ వేళ స్టాక్ తగ్గిపోయి స్తబ్ధత ఏర్పడిందని అంటున్నారు. రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందులో భాగంగా ఎక్కువగా మాంసం, పండ్లు వినియోగిస్తారు. యుద్ధం కారణంగా ముస్లిం దేశాలు అయిన ఓమన్, కువైట్, సౌదీ, దుబాయ్ వంటి దేశాల నుంచి ఆర్డర్లు లేవని, నౌకలు కూడా అటువైపు వెళ్లడం లేదని చెబుతున్నారు. ఇదేసమయంలో పోర్టుల్లో నిలిచిపోయిన నౌకలు డెమరేజ్ చార్జిల భారం తడిపిమోపెడు అవుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఎడాపెడా నష్టాలు ఎదురవుతున్నాయని స్థానికంగా రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
