ఇరాన్ యుద్ధంతో ఏ దేశాలకు నష్టం? ఏ దేశాలకు లాభం?
యుద్ధం కనుక పూర్తిస్థాయిలో ముదిరితే కోవిడ్ అనంతర కాలంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గ్లోబల్ ఎకానమీ మరోసారి 'మహా మాంద్యం' లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది.
By: A.N.Kumar | 16 April 2026 7:00 PM ISTమధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ భేరి మ్రోగుతోంది. ఇరాన్ కేంద్రంగా ఇజ్రాయెల్-అమెరికాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దు పోరాటానికే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలించేలా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజాగా విడుదల చేసిన 'వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్' నివేదిక ప్రపంచ దేశాలకు ఒక తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది. యుద్ధం కనుక పూర్తిస్థాయిలో ముదిరితే కోవిడ్ అనంతర కాలంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గ్లోబల్ ఎకానమీ మరోసారి 'మహా మాంద్యం' లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది.
మధ్యప్రాచ్యం అంటే ప్రపంచపు ఇంధన గిడ్డంగి. ఇక్కడి అస్థిరత నేరుగా చమురు, సహజ వాయువు సరఫరాపై ప్రభావం చూపుతుంది. 2026 నాటికి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరవచ్చన్న ఐఎంఎఫ్ అంచనా సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంధన ధరల పెరుగుదల అంటే కేవలం వాహనాల పెట్రోల్ ధరలే కాదు. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరితే, సామాన్యుడి కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. దీనిని అదుపు చేసేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది, ఇది క్రమంగా పెట్టుబడుల తగ్గుదలకు, నిరుద్యోగానికి దారితీస్తుంది. ఇది ఒక విషవలయం.
ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక జలమార్గాల్లో రవాణాకు ఆటంకం కలిగితే ప్రపంచ సరఫరా గొలుసు విచ్ఛిన్నమవుతుంది. 1970ల నాటి చమురు సంక్షోభం వంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరించడం గమనార్హం. యుద్ధం వల్ల ఇరాన్, ఇరాక్, ఖతార్ వంటి దేశాలు ఆర్థికంగా దశాబ్దాల వెనక్కి వెళ్లే ప్రమాదం ఉండగా యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి రేటు కూడా దారుణంగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే యుద్ధం వల్ల రష్యా వంటి చమురు ఎగుమతి దేశాలు స్వల్పకాలికంగా లాభపడవచ్చు కానీ, ప్రపంచవ్యాప్త ఆర్థిక అస్థిరత దీర్ఘకాలంలో ఎవరికీ మేలు చేయదు.
ఖతార్‌లోని రాస్ లఫాన్ వంటి కీలక ఇంధన కేంద్రాలపై దాడులు జరగడం, ప్రపంచం గ్యాస్ కొరతను ఎదుర్కోవాల్సి రావడం ఆందోళనకరం. ఆహార భద్రత కూడా ఈ యుద్ధ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రపంచ వృద్ధి రేటు 2 శాతం కంటే తక్కువకు పడిపోవడం అంటే అభివృద్ధి ఆగిపోయినట్లే లెక్క.
ప్రస్తుత తరుణంలో యుద్ధం ఎవరికీ ఏ పరిష్కారాన్ని చూపదు. యుద్ధం వల్ల కలిగే విధ్వంసం కేవలం ప్రాణనష్టానికే పరిమితం కాదు, అది తరాల ఆర్థిక భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తుంది. అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకుని, దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో, ప్రపంచం మరో ఆర్థిక చీకటి యుగంలోకి వెళ్లడం ఖాయం. శాంతి అనేది కేవలం ఆదర్శం మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక మనుగడకు అత్యవసరమైన పునాది అని పాలకులు గుర్తించాలి.
