ఇరాన్ దాడుల టార్గెట్‌గా అమెజాన్ క్లౌడ్ సెంటర్లు… గల్ఫ్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి..
సాధారణంగా యుద్ధం అంటే సైనికులు, సరిహద్దులు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా యుద్ధంలో భాగస్వాములు కాకపోయినా "టార్గెట్స్"గా మారుతున్నాయి.
By: A.N.Kumar | 2 April 2026 3:39 PM ISTమధ్యప్రాచ్యంలో మారుతున్న యుద్ధ ముఖచిత్రం ఇప్పుడు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాల డేటా సెంటర్‌ల వరకు విస్తరించింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు సరికొత్త మలుపు తిరుగుతూ అమెజాన్ క్లౌడ్ సెంటర్లు (ఏ.డబ్ల్యూఎస్) లక్ష్యంగా దాడులు జరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
డిజిటల్ యుద్ధక్షేత్రంగా మారిన మధ్యప్రాచ్యం
గత కొద్ది కాలంగా ఇరాన్ , అమెరికా మద్దతు ఉన్న దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అయితే ఈ పోరాటం ఇప్పుడు ఫిజికల్ వార్‌ఫేర్ నుంచి టెక్-వార్‌ఫేర్ వైపు మళ్లుతోంది. గత నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అమెజాన్ భవనంపై డ్రోన్ దాడులు జరిగిన వార్తలు మరువకముందే బహ్రెయిన్‌లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడికి పాల్పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం ఈ దాడి వల్ల క్లౌడ్ డేటా సెంటర్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీనివల్ల స్థానికంగానే కాకుండా ఆ సర్వర్లపై ఆధారపడిన పలు అంతర్జాతీయ సంస్థల సేవలకు కూడా అంతరాయం కలిగింది.
అమెజాన్‌ను ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తోంది?
ఈ దాడుల వెనుక ఇరాన్ చూపుతున్న కారణాలు భౌగోళిక రాజకీయ వ్యూహాలతో ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా మూడు అంశాలు ఇక్కడ కీలకంగా కనిపిస్తున్నాయి. అమెరికా రక్షణ విభాగం, ఇంటెలిజెన్స్ సంస్థలు తమ డేటా ప్రాసెసింగ్, నిఘా కమ్యూనికేషన్ వ్యవస్థల కోసం అమేజాన్ క్లౌడ్ సేవలను విస్తృతంగా ఉపయోగిస్తాయి. అమెజాన్ మౌలిక సదుపాయాలు అమెరికా సైనిక చర్యలకు వెన్నెముకగా ఉన్నాయని ఇరాన్ భావిస్తోంది. గ్లోబల్ టెక్ దిగ్గజాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడం.. తద్వారా పరోక్షంగా ఒత్తిడి తీసుకురావడం ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న అమెరికన్ టెక్నాలజీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఇరాన్ ఇటువంటి విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్త సంస్థలపై ప్రభావం
క్లౌడ్ టెక్నాలజీ అనేది నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటిది. బ్యాంకింగ్, హెల్త్ కేర్, స్టార్టప్స్ , ప్రభుత్వ విభాగాలు తమ విలువైన డేటాను ఏడబ్ల్యూ,ఎస్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలోనే భద్రపరుస్తాయి. ఒక ప్రాంతంలోని డేటా సెంటర్‌పై దాడి జరిగితే అది కేవలం ఆ దేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్ల డేటా యాక్సెస్‌పై ప్రభావం చూపుతుంది. ఇలాంటి దాడులు కొనసాగితే, భౌగోళికంగా అస్థిరత ఉన్న ప్రాంతాల్లో తమ డేటాను ఉంచేందుకు కంపెనీలు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది.
టెక్నాలజీ సంస్థలకు కొత్త సవాళ్లు
సాధారణంగా యుద్ధం అంటే సైనికులు, సరిహద్దులు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా యుద్ధంలో భాగస్వాములు కాకపోయినా "టార్గెట్స్"గా మారుతున్నాయి. ఇది కార్పొరేట్ భద్రతా వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తోంది.
"ఆధునిక యుద్ధం ఇకపై క్షిపణులతోనే కాదు, డేటా సెంటర్లను స్తంభింపజేయడం ద్వారా కూడా జరుగుతుంది. ఒక క్లౌడ్ సెంటర్ నిలిచిపోవడం అంటే ఒక దేశపు ఆర్థిక వ్యవస్థను కొంతసేపు స్తంభింపజేయడమే." అని టెక్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.
గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్య కాదు.. ఇది అంతర్జాతీయ టెక్నాలజీ భద్రతకు సంబంధించిన అంశం. ఇరాన్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ కోసం కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది. లేనిపక్షంలో దేశాల మధ్య గొడవల్లో సామాన్య ప్రజల డేటా వ్యాపార సంస్థల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
