ఆఫీస్ స్పేస్ కు అడ్డాగా హైదరాబాద్.. తాజాగా మైక్రోసాఫ్ట్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు ఒక్కొక్కటి హైదరాబాద్ లో అడుగు పెడుతున్నాయి.
By: Garuda Media | 26 Aug 2025 1:00 PM ISTప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు ఒక్కొక్కటి హైదరాబాద్ లో అడుగు పెడుతున్నాయి. అదే సమయంలో ఇప్పటికే భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు చేస్తున్న సంస్థలు.. పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతున్నాయి. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట తాజాగా హైదరాబాద్ లోని తన కార్యకలాపాల్ని భారీ ఎత్తున విస్తరించేందుకు వీలుగా ఆఫీసు స్పేస్ ను లీజుకు తీసుకుంది. దీనికి సంబంధించిన ఒప్పందం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఫీనిక్స్ సెంటారస్ భవనంలో 2.65 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకున్న వైనం పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికకరంగా మారింది.
ఇటీవల విడుదలైన నైట్ ఫ్రాంక్ రిపోర్టులో భారత్ లోని ప్రీమియం.. ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ అడ్డాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ వాదనను బలపరిచేలా తాజా లీజు డీల్ జరిగినట్లుగా చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ లో కోటి చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ డీల్ జరిగిందని.. అందులో టెక్నాలజీ దిగ్గజ కంపెనీల వాటానే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ తాజా డీల్ విషయానికి వస్తే.. ఫీనిక్స్ సెంటారస్ లోని మూడు.. నాలుగు అంతస్థుల ను ఐదేళ్ల లీజుకు మైక్రోసాఫ్ట్ తీసుకుంది.
జులై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందంలో చదరపు అడుగుకు రూ.67 చొప్పున మొత్తం స్థలానికి నెలకు రూ.1.77 కోట్ల కనీస అద్దె.. నిర్వహణ వ్యయాలు.. ఇతర ఛార్జీలు కలుపుకొని రూ.5.4 కోట్ల మొత్తాన్ని చెల్లించనుంది. ఈ అద్దె ప్రతి ఏడాది 4.8 శాతం పెరిగేలా లీజు ఒప్పందం కుదిరింది. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.42.15 కోట్లు జమ చేసింది. ఈ భవన యజమాని అయిన ఫీనిక్స్ టెక్ జోన్ నుంచి టేబుల్ స్పేస్ టెక్నాలజీస్ ఈ భవనాన్ని లీజుకు తీసుంది. దాన్ని మైక్రోసాఫ్ట్ లో కొంత భాగాన్ని ఇస్తూ తాజా ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ లో ఆఫీసు స్పేస్ గిరాకీ ఎలా ఉందన్న దానికి ఈ డీల్ ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు.
