Begin typing your search above and press return to search.

యమునా నదిలో చేపలపై ఢిల్లీ వర్సిటీ తాజా అధ్యయనం చదివితే వణుకే

నగరాల్లోని పరిశ్రమ రసాయనాలు.. ప్లాస్టిక్ వ్యర్థాలు.. శుద్ధి చేయని మరుగునీరు నేరుగా స్థానిక నదులు.. చెరువుల్లోకి కలవటంతో అక్కడి జలాశయాలు తీవ్రంగా కలుషితమవుతాయి.

By:  Garuda Media   |   4 Aug 2026 5:01 PM IST
యమునా నదిలో చేపలపై ఢిల్లీ వర్సిటీ తాజా అధ్యయనం చదివితే వణుకే
X

నది తీరాల్లో లభించే చేపల్ని తినే అలవాటు ఉందా? అయితే.. ఆ అలవాటును అర్జెంట్ గా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనిషి చేసే తప్పులు.. పాపాలు మళ్లీ అతన్నే వెంటాడటం మనకు తెలిసిందే. ఈ వాదన బలపరిచే మరో సాక్ష్యం ఇప్పుడు అధ్యయనం రూపంలో తెర మీదకు వచ్చింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. క్లుప్లంగా చెప్పాల్సి వస్తే.. ఢిల్లీ మహానగరంలో ప్రవహించే యమునా నదిలో లభించే చేపల్ని పరీక్షలు జరిపిన వారికి అదిరిపడే వాస్తవాల్ని వారు గుర్తించారు. అదేమంటే.. ఢిల్లీలోని యమునా నదిలో లభించే చేపల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు భారీగా ఉన్నట్లు తేల్చారు.

ఢిల్లీ, హర్యానాలోని నాలుగు ప్రాంతాల్లో 12 వేర్వేరు జాతులకు చెందిన 220 మంచినీటి చేపల్ని తమ అధ్యయనంలో భాగంగా పరీక్షించారు. హర్యానాలోని యమునా నగర్, కర్నాల్ తో పాటు ఢిల్లీలోని సూర్ ఘాట్, సోనియా విహార్ ప్రాంతాల్ని తమ అధ్యయనానికి తీసుకున్నారు. యమునానదిలో మైక్రో ప్లాస్టిక్ కాలుష్యం- చేపల్లో బయో అక్యుమలేషన్ సమగ్ర అంచనా పేరుతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇక్కడ బయో అక్యుములేషన్ అనే పదానికి అర్థం తెలుసుకుంటే.. తర్వాత తెలుసుకునే వివరాలు మరింత సులువుగా అర్థమవుతాయి.

నది నిటీలో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలు చేపల శరీరంలోకి చేరిన తర్వాత బయటకు పోకుండా.. కాలక్రమంలో వాటిల్లోనే పేరుకుపోవటాన్ని బయోఅక్యుములేషన్ గా చెబుతారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ రామ్ కృష్ణన్ నేగి నేతృత్వంలో నిర్వహించారు. వీరు ఢిల్లీ వర్సిటీ జువాలజీ విభాగానికి చీఫ్ గా చెప్పాలి. చేపల జీవశాస్త్రం.. జల కాలుష్యం లాంటి అంశాలపై ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ పరిశోధనకు ప్రధాన రచయిత్రిగా స్నేమా సివాచ్ వ్యవహరించారు. వీరితో పాటు పద్మ డోల్కర్, ఆర్జూ యాదవ్, అపూర్వ అత్రి, మీను చౌరాసియాలు కలిసి ఈ అంతర్జాతీయ పరిశోధనా పత్రాన్ని పబ్లిష్ చేశారు.

ఏడాది పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా తాము సేకరించిన వివిధ జాతుల చేపల నమూనాలను ఎఫ్ టీఐఆర్ (ఫోరియర్ ట్రాన్స్ ఫార్మ్ ఇన్ ఫ్రారెడె స్పెక్ట్రోస్కోపీ), ఎస్ఈఎం (స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ) సాంకేతికత ద్వారా ప్లాస్టిక్ మూలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. చేపల పొట్టలో దొరికిన కణాలు ప్లాస్టిక్కా? ఒకవేళ ప్లాస్టిక్కే అయితే.. అవి పాలిథిన్ కవర అవశేషాలా? వాటర్ బాటిల్ ప్లాస్టిక్కా? లాంటి వివరాల్ని గుర్తించే వీలు ఉంటుంది.

ఈ ప్లాస్టిక్ అవశేషాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే.. సాధారణ మైక్రో స్కోప్ లకు కూడా కనిపించవు. అలాంటి అతి చిన్న కణాల్ని చూసేందుకు ఎలక్ట్రాన్ కిరణాల్ని వాడటం ద్వారా అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ అవశేషాలు సదరు చేపల కణజాలంలో ఎలా ఉండిపోయాయి? అన్న విషయాల్ని తెలుసుకునే వీలు కలుగుతుంది. ఈ అధ్యయనం చెప్పిన కఠిన వాస్తవం ఏమంటే.. మహానగరాలు.. పట్టణాల పరిధిలోని చెరువులు.. నదుల నుంచి లభించే చేపల్ని నేరుగా ఆహారంగా తీసుకోవటం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందన్న విషయం తాజా అధ్యయనంతో స్పష్టమైందని చెప్పాలి.

నగరాల్లోని పరిశ్రమ రసాయనాలు.. ప్లాస్టిక్ వ్యర్థాలు.. శుద్ధి చేయని మరుగునీరు నేరుగా స్థానిక నదులు.. చెరువుల్లోకి కలవటంతో అక్కడి జలాశయాలు తీవ్రంగా కలుషితమవుతాయి. ఢిల్లీ వర్సిటీ అధ్యయనంతో పాటు.. ఇతర అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం చూస్తే.. మైక్రో ప్లాస్టిక్ కణాలు ఎక్కువగా చేపల పొట్ట.. పేగులు.. మొప్పల్లో పేరుకుపోతాయన్న విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో చేపల లోపలి భాగమైన పొట్ట.. పేగులు పూర్తిగా తొలగించి.. కేవలం ప్లష్ మాత్రమే వండుకు తినటం ద్వారా ప్లాస్టిక్ కణాల ముప్పు కొంత మేర తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నది అడుగు భాగంలో ఉండే చేపలు.. బురదలో ఆహారం వెతికే చేపలతో పోలిస్తే.. నీటి పైభాగంలో తిరిగే చిన్న చేపల్లో కాలుష్య తీవ్రత తక్కువగా ఉంటుందని గుర్తించారు. కలుషిత నగర నదుల నుంచి పట్టే చేపల కంటే..సముద్రపు చేపలు.. గ్రామీణ ప్రాంతాల్లోని కాలుష్య రహిత క్లీన్ వాటర్ ఫామ్ లో పెంచే చేపలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. మహానగరాల పరిధిలోని కలుషిత జలాశయాల నుంచి సేకరించే చేపల్ని తినే విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలని చెప్పాలి.

ఢిల్లీలోని యమునా నది సరే.. మరి తెలుగు రాష్ట్రాల్లోని ఏయే నదుల్లో ఈ తరహా ముప్పునకు అవకాశం ఉందన్న అంచనాలో చూస్తే.. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంతో పాటు.. హుస్సేన్ సాగర్ తో పాటు జవహర్ నగర్ లోని డంప్ యార్డు పరిసరాల్లోని జలాశయాల్లో మైక్రో ప్లాస్టిక్ కాలుష్య భూతం పొంచి ఉందన్న సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రవహించే క్రిష్ణా నదిలోనూ మానవ వ్యర్థాలు.. ప్లాస్టిక్ వ్యర్థాల విసిరివేతను మర్చిపోకూడదు. అదే సమయంలో రాజమండ్రి.. పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాల్లో గోదావరీ నదీ ఉపరితల నీటిలోనూ.. పరివాహన ప్రాంతాల్లోనూ మైక్రో ప్లాస్టిక్ కణాల్ని గతంలో నిర్వహించిన అధ్యయనాల్లో గుర్తించారు.

అంతేకాదు ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుగా చెప్పే కొల్లేరులోని విజయవాడ, ఏలూరు నుంచి వచ్చే బుడమేరు లాంటి డ్రైనేజీ కాలువలు కలుస్తాయి. వరదల వేళలో పట్టణ ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా కొల్లేరుకు చేరే ప్రమాదం పొంచి ఉందన్నది మర్చిపోకూడదు. అదే విధంగా విశాఖపట్నం, కాకినాడలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తక్షణం స్పందించటం.. ప్రజల ఆరోగ్యం మీద తీవ్రంగా ప్రభావితం చేసే ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఎవరికి వారు వ్యక్తిగతంగా చేపల్లోని ప్లాస్టిక్ అవశేషాల అంశంపై అవగాహనతో.. వాటిని కొనుగోలు చేయటం ద్వారా కొంత ముప్పును తప్పించుకునే వీలుందని చెప్పాలి. మొత్తంగా కాస్తంత జాగ్రత్తగా ఉండాలన్న చేదు నిజాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.