Begin typing your search above and press return to search.

చిన్న ఇల్లు - పెద్ద లైఫ్ స్టైల్.. జపాన్ మోడల్ ఇండియాకి వస్తుందా?

సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతీ ఒక్కరి డ్రీమ్. కానీ ప్రస్తుతం భూముల రేట్లు 120 శాతానికి పైగా పెరిగిపోవడంతో మెట్రో నగరాల్లో ఇల్లు కొనడం చుక్కలు చూపిస్తోంది.

By:  Madhu Reddy   |   9 Sept 2026 1:56 PM IST
చిన్న ఇల్లు - పెద్ద లైఫ్ స్టైల్.. జపాన్ మోడల్ ఇండియాకి వస్తుందా?
X

సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతీ ఒక్కరి డ్రీమ్. కానీ ప్రస్తుతం భూముల రేట్లు 120 శాతానికి పైగా పెరిగిపోవడంతో మెట్రో నగరాల్లో ఇల్లు కొనడం చుక్కలు చూపిస్తోంది. ఈ పరిస్థితిలో తక్కువ స్పేస్‌లో అన్ని సౌకర్యాలతో జీవించే 'మైక్రో అపార్ట్‌మెంట్స్' కాన్సెప్ట్ వేగంగా విస్తరిస్తోంది. జపాన్ వంటి దేశాల్లో సూపర్‌హిట్ అయిన ఈ మినిమలిస్ట్ లైఫ్‌స్టైల్ ట్రెండ్ మన దేశంలోకి కూడా అడుగుపెడుతోంది. దీనివల్ల మన జీవనశైలి ఎలా మారబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏమిటీ మైక్రో అపార్ట్‌మెంట్స్ కాన్సెప్ట్?:

మైక్రో అపార్ట్‌మెంట్స్ అంటే పరిమాణంలో చాలా చిన్నగా, కానీ డిజైన్‌లో అత్యంత ఆధునికంగా ఉండే ఇళ్లు. పరిమిత స్థలాన్ని ప్రతి అంగుళం అత్యంత సమర్థవంతంగా వాడుకునేలా వీటిని రూపుదిద్దుతారు. ఇక తక్కువ ఖర్చులో నగరంలోనే ప్రధాన ప్రాంతాల్లో నివసించాలనుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారబోతున్నాయి.

జపాన్ 'మినిమలిజం' స్పెషాలిటీ ఏంటి? :

జపాన్‌లో స్థలం కొరత ఎక్కువ. అందుకే వారు అవసరమైన వస్తువులనే ఇంట్లో ఉంచుకుంటూ 'మినిమలిజం' పాటిస్తారు. ఇక పగటిపూట సోఫాలా ఉండి, రాత్రికి బెడ్‌గా మారే ఫర్నిచర్, గోడల్లోనే దాగిపోయే డైనింగ్ టేబుల్స్ వాడతారు. ఇలా ఎన్నో జపనీస్ ఫర్నేచర్ మనం ఇప్పటికే సోషల్ మీడియాలో చూసే ఉంటాం. ఈ జపనీస్ డిజైన్ మోడల్ ఇప్పుడు మన భారతీయులను కూడా బాగా ఆకట్టుకుంటోంది.

తక్కువ బడ్జెట్ – నగరంలో సొంత ఇల్లు:

నగరాల్లో ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల పెద్ద ఇళ్లు కొనడం సామాన్యులకు భారం. మైక్రో ఇళ్ల వల్ల నిర్మాణ వ్యయం, భూమి ఖర్చు గణనీయంగా తగ్గుతాయి. ఇక ఐటీ ఉద్యోగులు, బ్యాచిలర్స్, కొత్తగా పెళ్లయిన జంటలకు తక్కువ బడ్జెట్‌లోనే ప్రైమ్ లొకేషన్లలో స్వంత ఇల్లు పొందేందుకు ఇదొక గొప్ప అవకాశంగా మారుతోంది.

వర్టికల్ లివింగ్ – భవిష్యత్తు నగరాల అవసరం:

భూమి లభ్యత తగ్గుతున్న కొద్దీ నగరాలు పక్కలకు కాకుండా పైకి పెరగాల్సి వస్తోంది .ఇక ఎత్తైన భవనాల్లో మైక్రో యూనిట్లను నిర్మించడం వల్ల భూమి వినియోగం తగ్గుతుంది. అంతేకాకుండా విద్యుత్, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా మిగిలి, పర్యావరణానికి మేలు జరుగుతుంది.

ఇక పెరుగుతున్న జనాభా, ఆకాశాన్నంటుతున్న ధరల నేపథ్యంలో "తక్కువ స్థలం – ఎక్కువ సౌకర్యం" అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, భవిష్యత్తు నగరాల అవసరం. ఇక పెద్ద ఇళ్ల మోజు నుంచి బయటపడి, సౌకర్యవంతమైన చిన్న ఇళ్ల వైపు అడుగులేసే కొత్త జీవన విధానం మన దేశంలోనూ త్వరలోనే ప్రధాన ట్రెండ్‌గా మారబోతోంది అంటున్నారు విశ్లేషకులు.