బ్రేకప్: 600కోట్ల సంపదలో 300 కోట్లు భార్యకు సెటిల్ చేసిన క్రికెటర్
ఇటీవల కొంతకాలంగా టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మ విడాకుల కేసు గురించి మీడియాలో చాలా చర్చ సాగింది.
By: Sivaji Kontham | 27 Jan 2026 4:00 AM ISTఇటీవల కొంతకాలంగా టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మ విడాకుల కేసు గురించి మీడియాలో చాలా చర్చ సాగింది. చాహల్ 4.75 కోట్లు సెటిల్ మెంట్ కోసం చెల్లించాడంటూ ప్రచారమైంది. ఎన్డీటీవీ సైతం తన కథనంలో దీనిని ప్రచారం చేయడంతో అది నిజమేనని భావించారు. కానీ ఈ సెటిల్ మెంట్ గురించి చాహల్ కానీ, ధనశ్రీ కానీ అధికారికంగా ధృవీకరించలేదు. ఒకానొక సమయంలో ధనశ్రీకి విడాకులు ఇవ్వాలంటే చాహల్ 60 కోట్లు చెల్లించుకోవాల్సిందేనని, ధనశ్రీ అంత పెద్ద మొత్తం డిమాండ్ చేస్తోందని కూడా ప్రచారం సాగిపోయింది.
అయితే ఇప్పుడు అంతకుమించిన ప్రచారం క్రికెటర్ మైఖేల్ క్లార్క్ విషయంలో సాగుతోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తన వ్యక్తిగత జీవితం, విడాకుల సెటిల్‌మెంట్ వార్తలతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ముఖ్యంగా భరణం కింద ఆయన చెల్లించినట్లు చెబుతున్న రూ. 300 కోట్ల వార్త సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మైఖేల్ క్లార్క్ 2012లో మోడల్ కం టీవీ ప్రెజెంటర్ అయిన కైలీ బోల్డీ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె (కెల్సీ లీ) కూడా ఉంది. అయితే సుమారు 7 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ 2020లో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విడాకులు పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా జరిగినట్లు వారు పేర్కొన్నారు.
విడాకులకు ప్రధాన కారణం మైఖేల్ క్లార్క్ తన వ్యక్తిగత సహాయకురాలితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమేనని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. క్లార్క్ తన అసిస్టెంట్‌తో సన్నిహితంగా ఉన్న సమయంలో భార్య కైలీ వారిని పట్టుకున్నట్లు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత క్లార్క్ ఫ్యాషన్ డిజైనర్ పిప్ ఎడ్వర్డ్స్‌తో కూడా డేటింగ్ చేశారు. ఈ వ్యవహారాలు ఆయన వైవాహిక జీవితం దెబ్బతినడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
తాజా సమాచారం మేరకు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల సెటిల్‌మెంట్లలో ఇది ఒకటిగా నిలిచింది.
విడాకుల ఒప్పందం ప్రకారం క్లార్క్ తన భార్యకు సుమారు 40 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించినట్లు సమాచారం. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ. 300 కోట్లు. తన జీవితకాల సంపాదనలో సగానికి పైగా మొత్తాన్ని అతడు భరణం రూపంలో చెల్లించాల్సి వచ్చిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, కుమార్తె కెల్సీ లీ కోసం వీరు అప్పుడప్పుడు కలుస్తుంటారు. కుమార్తె బాధ్యతలను ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు. క్లార్క్ తన కుమార్తెతో గడిపే ఫోటోలను రెగ్యులర్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆస్ట్రేలియాను ప్రపంచ విజేతగా నిలిపిన కెప్టెన్, తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆర్థికంగా, సామాజికంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మైఖేల్ క్లార్క్ రికీపాంటింగ్ తర్వాత అత్యంత విజయవంతమైన ఆస్ట్రేలియన్ టీమ్ కెప్టెన్. అతడు 2015లో రథసారథిగా తన టీమ్ కి ప్రపంచకప్ ని అందించాడు.
