చంద్రబాబుకు చాలా రిస్క్.. కేంద్రం చేసిన పనితో ఇబ్బందులు తప్పవా?
అయితే తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఉపాధి హామీ చట్టాన్ని సమూలంగా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం.
By: Tupaki Political Desk | 23 Dec 2025 9:00 PM ISTగ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతోపాటు నిధుల వాటా నిష్పత్తిని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తీవ్ర సమస్యగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక చట్టం ద్వారా వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఉపాధికి గ్యారెంటీ కల్పిస్తూ యూపీఏ ప్రభుత్వంలో ఈ చట్టం చేశారు. గత పదకొండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది. అయితే తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఉపాధి హామీ చట్టాన్ని సమూలంగా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం.
మహాత్మాగాంధీ పేరిట ఉన్నా చట్టం పేరును మారుస్తూ వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ గా పేరు పెట్టింది. ఇలా పేరు మార్చడమే కాకుండా కేంద్రం విడుదల చేసే నిధులను భారీగా తగ్గించేసింది. ఇంతవరకు ఈ పథకం కింద కేంద్రం 90 శాతం నిధులు సమకూర్చితే రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం వాటా సమకూర్చేవి. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సవరణలతో కేంద్రం వాటా 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గిపోనుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను 40 శాతం భరించాల్సివుంటుంది. చట్ట సవరణపై రాజకీయ విమర్శలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి విపక్ష పార్టీలకు చెందిన నేతలు అంతా కేంద్రం తీసుకువచ్చిన సవరణలను తప్పుబడుతున్నాయి.
అయితే, కేంద్రం చేసిన సవరణలపై దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చ జరుగుతున్నప్పటికీ, ఏపీకి వచ్చేసరికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం తీవ్ర నష్టమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు తోడుగా ఉపాధి హామీ పథకం నిలిచే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో లక్షల మంది కూలీలు ఉపాధి పథకంపై ఆధారపడుతున్నారు. దీనివల్ల గణనీయంగా వలసలు తగ్గాయనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం తగ్గించిన వాటాను రాష్ట్రం భర్తీ చేయడం సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనివల్ల కూలీలకు పని కల్పనతోపాటు సకాలంలో బిల్లుల చెల్లింపు సవాల్ గా మారే అవకాశం ఉందంటున్నారు.
పని కల్పన, బిల్లుల చెల్లింపుల్లో ఏం తేడా జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయంగా నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా అభివృద్ధిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటివరకు కూలీలకు పని కల్పనకే నిధులు కేటాయించేవారు. కానీ, ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. సీఎం చంద్రబాబు సిఫార్సులతో ఉపాధి పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ చేర్చారు. దీనివల్ల కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉందని నిర్ణయించారు. అలా ఉపాధి పథకంలో చేసిన మార్పులతో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, పంచాయతీ భవనాల నిర్మాణం వంటి పనులు జరిగాయి.
ఏపీలో కూడా ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మిస్తున్న రోడ్లు, కాలువలు, గోశాలలు వంటి పనులకు ఉపాధి నిధులనే వెచ్చిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రం తాజాగా చేసిన సవరణతో ఈ నిధుల విడుదలలో భారీగా తేడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. కేంద్రంపై భారం తగ్గి.. ఆ భారం రాష్ట్రంపై పడటం వల్ల అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందంటున్నారు. కేంద్రం చేసిన సవరణతో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు విధాలుగా నష్టపోయే ప్రమాదం ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. పని కల్పనలో తేడా జరిగితే ఉపాధి కూలీల నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. అదేసమయంలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతే సీఎం చంద్రబాబు ఇమేజ్ మసకబారే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఈ సవాల్ నుంచి సీఎం ఎలా బయటపడతారనేది చూడాల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు.
