మొన్న అమెరికా.. నేడు మెక్సికో.. ఇండియా, చైనాపై 50 శాతం సుంకాలు
మెక్సికో ప్రభుత్వం ఆసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ టారిఫ్ లు విధించే బిల్లుకు ఆమోదం తెలిపింది.
By: A.N.Kumar | 11 Dec 2025 7:15 PM ISTపక్కోడు తొడ కోసుకుంటే.. నేను మెడకోసుకుంటానన్నాడట వెనుకటికి ఒకడు. ఇప్పుడు మెక్సికో దేశం కూడా అలానే తయారైంది. పక్క దేశం అమెరికా పొద్దున లేచిన దగ్గర నుంచి ఇండియా, చైనా పై పడి ఏడుస్తోంది. ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నాడు. దీంతో అమెరికా బాటలోనే ఇప్పుడు మెక్సికో కూడా నడిచి ఆ అడుగులు వేసింది. తాజాగా భారత్, చైనాలపై 50 శాతం సుంకాలు విధిస్తూ చేసిన బిల్లుపై మెక్సికో సెనెట్ ఆమోదం తెలిపింది.
మెక్సికో ప్రభుత్వం ఆసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ టారిఫ్ లు విధించే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ కఠిన చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన వాణిజ్య విధానాలకు దగ్గరగా ఉన్నట్టుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇండియా , చైనా , దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే 1400కు పైగా ఉత్పత్తులపై ఈ కొత్త సుంకాలు వర్తించనున్నాయి. టారిఫ్ లు 5 శాతం నుంచి 50 శాతం వరకూ ఉండనున్నాయి. సెనెట్ లో ఈ బిల్లుకు 76 అనుకూల ఓట్లు లభించాయి. కొత్త సుంకాలు వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచి అమల్లోకి రానున్నాయి.
మెక్సికో ఆర్థిక మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం.. ఈ చర్యల ద్వారా వచ్చే ఏడాదిలో 52 బిలియన్ పెసోస్ (సుమారు 2.8 బిలియన్ డాలర్ల) అదనపు ఆదాయం సమకూరనుంది. స్థానిక అటోమొబైల్ తయారీ రంగానికి రక్షణ కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని మెక్సికో అధికారులు తెలిపారు.
కొత్త టారీఫ్ లలో ముఖ్యంగా కొన్ని ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించారు. చైనా కార్లకు 50 శాతం వరకూ భారీ సుంకం విధించారు. స్టీల్ , అల్లూమినియం, ఆటోపార్ట్స్, దుస్తులు, మెటల్స్ వంటి పలు ఉత్పత్తులకు 5 నుంచి 50 శాతం వరకూ సుంకాలు వేశారు. ప్రస్తుతం చైనా కార్లు మెక్సికో మార్కెట్ లో 20 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ టారిఫ్ లు చైనా ఆటోరంగంపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి.
ఫ్రీ ట్రేడ్ నుంచి కఠిన చర్యల వైపు ‘మెక్సికో’ చూపు
మెక్సికో ఎప్పటి నుంచో ఫ్రీ ట్రేడ్ దేశంగా గుర్తింపు పొంది.. ప్రపంచంలోని అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉంది. ఇప్పుడు పూర్తిగా వ్యతిరేక దిశగా అడుగులు వేయడంపై నిఫుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్ బామ్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో కీలక వాణిజ్య చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ బిల్లు ఆమోదించబడడం గమనార్హం.
కొత్త చట్టం ప్రకారం మెక్సికో ఎకానమీ మంత్రిత్వశాఖకు ఇకపై దిగుమతి సుంకాలను తక్షణమే పెంచడం లేదా? తగ్గించే అధికారం లభించింది. వచ్చ ఏడాది జరుగబోయే యూఎస్, కెనడా, మెక్సికో అగ్రిమెంట్ లో ఈ అధికారం మెక్సికోకు కీలక ఆయుధంగా మారవచ్చని విశ్లేషఖులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడా మధ్య వాణిజ్య సంబంధాలను నియంత్రిస్తుంది.
ఇక ఆసియా దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడే మెక్సికో తయారీ కంపెనీలు తమ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఇదిదేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీయవచ్చని వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
