రాత్రిళ్లు ఢిల్లీ పార్కులు కుటుంబాలతో కిటకిట
తమ దేశంలో (మెక్సికో) రాత్రి వేళ కుటుంబాలు బయటకు వచ్చి పార్కుల్లో గడపటం చాలా అరుదుగా ఆమె పేర్కొన్నారు.
By: Garuda Media | 9 Jun 2026 9:55 AM ISTసోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం ఒక చిన్న కుగ్రామంగా మారింది. ఆసక్తికర అంశం ఏదైనా సరే ఇట్టే వైరల్ కావటమే కాదు.. అందరికి ఆ విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. అరచేతిలో ప్రపంచాన్ని చూపించే స్మార్ట్ ఫోన్ పుణ్యామా అని ఇప్పుడు సగటు జీవి సమాచార పరిధి ప్రపంచానికి విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో.. మనకు ఏ మాత్రం పరిచయం లేని ఎన్నో అంశాలు ఇప్పుడు ఇట్టే తెలిసిపోతున్న పరిస్థితి. తాజాగా మెక్సికోకు చెందిన గ్రాబియెల్ అనే యువతి.. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె చూసిన ఒక అంశం గాబ్రియెల్ ను తీవ్ర ఆశ్చర్యానికి గురి కావటమే కాదు.. తమ దేశంలో అలాంటి పరిస్థితే ఉండదని చెబుతున్నారు.
ఆమె చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకూ ఆమె గుర్తించిన విస్మయకరమైన అంశం ఏమంటే.. దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి.. బాగా పొద్దుపోయిన రాత్రివేళలోనే కాదు అర్థరాత్రి సమయంలోనూ కుటుంబాలతో ఢిల్లీ ప్రజలు పార్కుల్లో నిండిపోతున్న వైనం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. అర్థరాత్రి వేళ వరకు కుటుంబ సభ్యులతో కలిసి పార్కులకు వెళ్లటం.. వారి కారణంగా పార్కులు కిటకిటలాడటం తనకు ఆశ్చర్యానికి గురి చేసినట్లు ఆమె చెప్పారు.
తమ దేశంలో (మెక్సికో) రాత్రి వేళ కుటుంబాలు బయటకు వచ్చి పార్కుల్లో గడపటం చాలా అరుదుగా ఆమె పేర్కొన్నారు. ఇంతకూ ఢిల్లీ ప్రజలు అర్థరాత్రి వేళలోనూ ఇంత భారీగా పార్కులకు రావటానికి.. అక్కడ టైం స్పెండ్ చేయటానికి కారణం లేకపోలేదు. ఈ వేసవి ఉక్కను అధిగమించేందుకు.. కాస్తంత చల్లగాలిని అస్వాదించేందుకు కుటుంబాలతో సహా పార్కులకు రావటంతో ఢిల్లీలోని పార్కులు కుటుంబాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా వీకెండ్ లో ఈ జోరు మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ మెక్సికో యువతి భర్త గౌరవ్ భారతీయుడు కావటం గమనార్హం. తన భార్య ఆశ్చర్యాన్ని వివరిస్తూ.. ఢిల్లీలోని వేడి తీవ్రత కారణంగా ఢిల్లీ ప్రజలు రాత్రి పొద్దుపోయిన తర్వాత పార్కులకు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కల్చర్ గ్రాబియెల్ కు కొత్తగా అనిపించినట్లు చెప్పాడు. ఇక.. గాబ్రియెల్ విషయానికి వస్తే ఆమె ఒక సైకాలజిస్టు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ గా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. ఆమెకు భారత కుటుంబ వ్యవస్థ.. ఇక్కడి ఫ్యామిలీ వాల్యూస్ చాలా ఇష్టమని చెబుతారు. ఆమె.. చేస్తున్న వీడియోలు పలువురిని ఆకర్షిస్తున్నాయి.
