Begin typing your search above and press return to search.

ముదురుతున్న మోదీ వీడియో తొలగింపు వివాదం.. కేంద్రం కాళ్ల బేరానికి ‘మెటా’ ప్రతినిధులు

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియోను ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారమ్ నుంచి ఉన్నపళంగా తొలగించిన వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, న్యాయపరమైన సంచలనానికి దారితీసింది.

By:  Tupaki Political Desk   |   5 Aug 2026 6:11 PM IST
ముదురుతున్న మోదీ వీడియో తొలగింపు వివాదం.. కేంద్రం కాళ్ల బేరానికి ‘మెటా’ ప్రతినిధులు
X

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియోను ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారమ్ నుంచి ఉన్నపళంగా తొలగించిన వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, న్యాయపరమైన సంచలనానికి దారితీసింది. ఈ సున్నితమైన అంశంపై మెటా సంస్థ అందించిన వివరణ పట్ల కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మెటా సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పార్లమెంటరీ కమిటీ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ రాబోయే మూడు రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని స్పష్టమైన అల్టిమేటమ్ జారీ చేసినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.

దీంతో పాటు సోషల్ మీడియా వేదికల్లో మహిళలు, చిన్నారుల హక్కులకు భంగం కలిగించేలా వారిని అవమానించేలా లేదా చట్టానికి విరుద్ధంగా ఉండే ఎలాంటి కంటెంట్‌నైనా తక్షణమే తొలగించేలా మెటా కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ అత్యున్నత స్థాయిలో ఆదేశించింది. ఒకవేళ తమ ఆదేశాలను, సూచనలను బేఖాతరు చేస్తే ప్రస్తుతం భారత సమాచార సాంకేతిక చట్టం కింద మధ్యవర్తిత్వ డిజిటల్ సంస్థలకు లభిస్తున్న 'సేఫ్ హార్బర్' లేదా లీగల్ ఇమ్యూనిటీ రక్షణను పూర్తిగా ఉపసంహరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

భారత్‌లో 'సేఫ్ హార్బర్' హోదాను గనుక మెటా కోల్పోతే ఆ సంస్థ ఇక్కడ ఊహించని రీతిలో భారీ న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, థ్రెడ్స్ , మెసెంజర్ వంటి విస్తృత ప్లాట్‌ఫారమ్‌లలో కోట్లాది మంది వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్‌కు ఆయా సంస్థలకు ఇప్పటివరకు పరిమిత బాధ్యత మాత్రమే ఉండేది. అంటే వినియోగదారుల పోస్టులకు సంస్థను నేరుగా బాధ్యులను చేసే అవకాశం లేదు. అయితే ఈ చట్టపరమైన రక్షణ కవచం తొలగిపోతే ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యక్షమయ్యే ప్రతి అభ్యంతరకరమైన, ఉద్రేకపూరితమైన లేదా చట్టవిరుద్ధమైన పోస్టుకు మెటా యాజమాన్యమే నేరుగా చట్టసభలు, న్యాయస్థానాల ముందు బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతేకాకుండా సంస్థ ప్రతినిధులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసే వీలు కూడా కలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నమోదు చేసిన వివిధ కేసుల దర్యాప్తు పురోగతిపై కూడా ఈ పరిణామం గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది.

ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ, మెటా ప్రతినిధి బృందం కేంద్ర సమాచార , సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో అత్యవసరంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో వివాదాస్పద అంశానికి సంబంధించి సంస్థ వైఖరిని, భవిష్యత్తులో తీసుకోబోయే సాంకేతిక నియంత్రణ చర్యలను వివరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మెటా ఇచ్చిన వివరణలతో పార్లమెంటరీ కమిటీ కానీ, ప్రభుత్వం కానీ సంతృప్తి చెందకపోవడంతో జుకర్‌బర్గ్ నుంచి నేరుగా బహిరంగ క్షమాపణ రావాల్సిందేనన్న కఠిన డిమాండ్‌పై కేంద్రం ఇప్పటికీ నిలకడగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు భారత్‌లో గ్లోబల్ టెక్ దిగ్గజాల బాధ్యతను, డిజిటల్ కంటెంట్ నియంత్రణను, సేఫ్ హార్బర్ రక్షణ అంశాలను కొత్త మలుపు తిప్పే అవకాశముంది.