Begin typing your search above and press return to search.

మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా మోడీకి క్షమాపణ చెప్పాల్సిందే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక ఫేస్‌బుక్ వీడియోను మెటా సంస్థ తాత్కాలికంగా తొలగించిన వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

By:  A.N.Kumar   |   4 Aug 2026 10:58 AM IST
మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా మోడీకి క్షమాపణ చెప్పాల్సిందే..
X

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక ఫేస్‌బుక్ వీడియోను మెటా సంస్థ తాత్కాలికంగా తొలగించిన వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. దీనిని కేవలం సాంకేతిక లోపంగా మెటా కొట్టిపారేసినప్పటికీ ఈ విషయం పార్లమెంటరీ స్థాయికి చేరుకోవడంతో సోషల్ మీడియా దిగ్గజాలపై ఒత్తిడి మరింత పెరిగింది. డిజిటల్ వేదికల బాధ్యతారహిత ప్రవర్తన, పారదర్శకత లేకపోవడం, భారత చట్టాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు మరోసారి వ్యక్తమవుతున్నాయి.

ఈ తీవ్ర పరిణామంపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అత్యంత కఠినంగా స్పందించింది. కమిటీ ఛైర్మన్ నిషికాంత్ దూబే నేతృత్వంలో సమావేశమైన ఈ ప్యానెల్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా ఈ ఘటనపై భారతదేశానికి, ప్రధానికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ పొరపాటు ఎలా జరిగింది.. దీని వెనుక ఉన్న కారణాలేంటి? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి కంటెంట్ మోడరేషన్ చర్యలు తీసుకుంటారో వివరిస్తూ పూర్తి స్థాయి లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించడానికి మెటాకు పది రోజుల గడువు విధించింది.

సాధారణంగా సోషల్ మీడియా సంస్థలు సాంకేతిక పొరపాటు అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. అయితే కేవలం "టెక్నికల్ ఎర్రర్" అనే వివరణతో కమిటీ సభ్యులు సంతృప్తి చెందలేదు. ఒక దేశ ప్రధాని అధికారిక వీడియోను తొలగించడాన్ని సాధారణ సాఫ్ట్‌వేర్ పొరపాటుగా పరిగణించలేమని.. దీని వెనుక ఉన్న వ్యవస్థాపరమైన లోపాలను బయటపెట్టాల్సిందేనని కమిటీ గట్టిగా పట్టుబట్టింది. ఇప్పటికే పొరపాటును గుర్తించి వీడియోను పునరుద్ధరించామని.. తమ వైపు నుంచి జరిగిన తప్పిదానికి క్షమాపణలు కూడా చెప్పామని మెటా ప్రతినిధులు పేర్కొన్నప్పటికీ ఆ వివరణ సరిపోదని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా కమిటీ ఒక కీలకమైన హెచ్చరికను కూడా జారీ చేసింది. మెటా సమర్పించే నివేదిక సంతృప్తికరంగా లేకపోతే భారత ఐటీ చట్టాల ప్రకారం సోషల్ మీడియా సంస్థలకు లభించే 'సేఫ్ హార్బర్' రక్షణను సమీక్షిస్తామని సూచనప్రాయంగా తెలిపింది. సాధారణంగా ఈ సేఫ్ హార్బర్ రక్షణ వల్ల వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్‌కు ప్లాట్‌ఫారమ్‌లు నేరుగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఈ హోదా రద్దయితే భారత్‌లో మెటా సంస్థపై చట్టపరమైన బాధ్యతలు, శిక్షార్హత గా పెరిగే ప్రమాదం ఉంది.

ఈ పరిణామం వల్ల ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజాలు భారతదేశ చట్టాలకు ఎంతవరకు కట్టుబడి పనిచేస్తున్నాయి.. వాటి కంటెంట్ ఫిల్టరింగ్ విధానాలు ఎంత పారదర్శకంగా ఉన్నాయనే అంశాలపై కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు పార్లమెంటరీ కమిటీకి మెటా ఎలాంటి వివరణ ఇస్తుంది.? మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత క్షమాపణ డిమాండ్‌పై మెటా మేనేజ్‌మెంట్ ఎలా స్పందిస్తుందనే విషయాలు రానున్న రోజుల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.