రేవంత్ వర్సెస్ మెస్సీ.. హైదరాబాద్ లో మహా "కిక్"
ప్రపంచ చాంపియన్ మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ అంటే మాటలా? అందుకే సీఎం రేవంత్ ప్రాక్టీస్ బాగా చేశారు.
By: Tupaki Political Desk | 12 Dec 2025 9:14 PM ISTకేవలం కాలు కదిపితేనే మొత్తం ప్రపంచమే ఊగిపోయేలా చేసే ఫుట్ బాల్ దిగ్గజం ఒకవైపు... ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పనిచేస్తూ ప్రజాభిమానం చూరగొనే రాజకీయ నాయకుడు మరోవైపు...! ఈ ఇద్దరూ ఒకే మైదానంలో తలపడితే ఎలా ఉంటుంది...? అందరి కళ్లూ అక్కడే ఆగిపోవూ... దేశం మొత్తం ఇటువైపే చూడదూ..? ఇప్పుడు హైదరాబాద్ లో శనివారం అదే జరగబోతోంది.. ఐటీ నగరిలో అసలే వీకెండ్.. ఆపై ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనున్న దిగ్గజం.. ఇంకేం? ఇంత చలిలోనూ నగరం వేడెక్కుతోంది. ఇటీవలే గ్లోబల్ సమ్మిట్ పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన భారీ పెట్టుబడుల, భవిష్యత్ ఆలోచనల సదస్సుతో సీఎం రేవంత్ రెడ్డి స్థాయి పెరిగింది.
ఇప్పుడు ఫుట్ బాల్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)గా పేరు తెచ్చుకున్న అర్జెంటీనా ఆటగాడు లయోనల్ మెస్సీతో మ్యాచ్ ద్వారా ప్రపంచం అంతా ఒక్కసారిగా ఇటువైపు చూసేలా చేయనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఈ మ్యాచ్ కు సర్వం సిద్ధం అయింది. మరికొద్ది గంటల్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. టీవీల ముందు చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
వారంలోనే రెండో ఈవెంట్..
ప్రపంచ నగరిగా ఎదుగుతున్న హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు కొత్తేం కాదు. ఈ నెల 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ జరగ్గా.. 13న రేవంత్ సారథ్యంలోని సింగరేణి ఆర్ ఆర్ వర్సెస్ మెస్సీ (అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్) జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ కు నగరం వేదిక అవుతోంది. ఇటీవలి కాలంలో మెస్సీ బయటి ప్రపంచానికి వచ్చిందే చాలా తక్కువ. ఇప్పుడు మాత్రం గోట్ భారత టూర్ లో హల్ చల్ చేస్తున్నాడు. మరోవైపు నాలుగైదు రోజుల కిందటి వరకు గ్లోబల్ సమ్మిట్ లో ఊపరిసలపకుండా గడిపిన సీఎం రేవంత్ ఇప్పుడు మైదానంలోకి దిగుతున్నారు. దీంతో ప్రపంచం ఫోకస్ అంతా హైదరాబాద్ పై నిలిచిందని చెప్పవచ్చు.
ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ఫుట్ బాల్ లవర్
ప్రపంచ చాంపియన్ మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ అంటే మాటలా? అందుకే సీఎం రేవంత్ ప్రాక్టీస్ బాగా చేశారు. రెండు వారాలుగా ఆయన ఈ మ్యాచ్ కోసం సిద్ధం అవుతున్నారు. వాస్తవానికి మెస్సీతో ఆడేది ఎగ్జిబిషన్ మ్యాచ్. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటిదాంట్లో అలా పాల్గొని ఇలా బంతిని కిక్ కొట్టి వెళ్లిపోతే చాలు. కానీ, సహజంగానే ఫుట్ బాల్ ప్రేమికుడు, ఆటగాడు అయిన రేవంత్.. మెస్సీతో గేమ్ ను సీరియస్ గా తీసుకున్నారు. దీంతో శనివారం మ్యాచ్ అంచనాలను పెంచుతోంది.
-శనివారం సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే ఎగ్జిబిషన్ మ్యాచ్.. తెలంగాణ క్రీడా, సాంస్కృతిక చరిత్రలో నిలిచిపోనుంది. దీంతో రేవంత్ ప్రభుత్వం ఈ ప్రక్రియను సజావుగా జరిగేలా పక్కాగా ప్లానింగ్ చేస్తోంది. ఉప్పల్ మైదానంలో ప్రేక్షకుల సామర్థ్యం 30 వేలు. కాగా, ఇక రేవంత్, మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ 20 నిమిషాలు జరుగుతుంది. అందుకే ఇప్పటికే హైదరాబాద్ లో కిక్ మొదలైంది.
