మెస్సీ టూర్ : కోల్ కతాలో ఫ్యాన్స్ కు అందుకే కోపమొచ్చింది.. విధ్వంసం చేశారు
అభిమానం హద్దులు దాటితే ఎంత విధ్వంసమో మరోసారి ఇండియాలో మెస్సీ టూర్ చూపించింది. ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకుంటే ఎంతటి ఉపద్రవమో కూడా చాటి చెప్పింది.
By: A.N.Kumar | 13 Dec 2025 6:37 PM ISTఅభిమానం హద్దులు దాటితే ఎంత విధ్వంసమో మరోసారి ఇండియాలో మెస్సీ టూర్ చూపించింది. ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకుంటే ఎంతటి ఉపద్రవమో కూడా చాటి చెప్పింది. తాజాగా ఆర్టెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా కోల్ కతా పర్యటనలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ అభిమాన స్టార్ ను దగ్గర నుంచి చూడాలని అతడి ఆటను వీక్షించాలని రోజుల తరబడి ఎదురుచూసిన ఫుట్ బాల్ అభిమానుల సహనం ఒక్కసారిగా కోల్పోయింది. కేవలం 5 నిమిషాలు కూడా మెస్సి స్టేడియంలో ఉండకపోవడం.. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. ఫలితంగా శనివారం కోల్ కతాలోని వివేకానంద యువభారతి సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్రమైన విధ్వంసం జరిగింది.
10 నిమిషాల్లోనే స్టార్ నిష్క్రమణ
తెల్లవారుజామున కోల్ కతాలో అడుగుపెట్టిన మెస్సి ఉదయం 11.30 గంటల సమయంలో సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకున్నాడు. అప్పటికే పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే మెస్సిని రాజకీయ నాయకులు, ఫుట్ బాల్ మాజీ క్రీడాకారులు, కోచ్ లు, ఇతర ప్రముఖులు చుట్టుముట్టడంతో సాధారణ స్టాండ్స్ లో ఉన్న అభిమానులకు ఈ స్టార్ ఆటగాడిని చూసే అవకాశం దక్కలేదు. చుట్టూ ఉన్న వారిని దూరం జరిపే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.
భద్రతా కారణాల దృష్ట్యా అలాగే ఈ గందరగోళ పరిస్థితుల వల్ల ముందుగా నిర్ణయించిన రెండు ఈ వెంట్లను నిర్వహించలేకపోయారు. దీంతో నిర్వాహకులు కేవలం 10 నిమిషాల్లోనే మెస్సిని స్టేడియం నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ 10 నిమిషాల్లో అభిమానులకు మెస్సిని కనీసం 5 నిమిషాలైనా కనిపించలేదని సమాచారం.
టికెట్ల కోసం వేల ఖర్చు.. ఆగ్రహంతో విధ్వంసం
మెస్సి వెళ్లపోవడాన్ని చూసిన అభిమానులు అదుపుతప్పారు. టికెట్ కోసం ఒక్కొక్కరు రూ.5 వేల నుంచి రూ.10వేల వరకూ భారీగా వెచ్చించి గంటల తరబడి వేచిచూసిన వారికి కనీసం మెస్సీ నుంచి ఒక్క పలకరింపు కూడా లేకపోవడం వారిని అసహనానికి గురిచేసింది. మెస్సి వెళ్లిపోయిన వెంటనే స్టేడియంలోకి దూసుకొచ్చిన అభిమానులు.. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా వారిని నియంత్రించలేకపోయారు. గంట పాటు ఈ గందరగోళం కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను గవర్నర్ ఆదేశించారు.
దేశమంతా మెస్సీ టూర్
మొత్తం 72 గంటల కంటే తక్కువే భారత్ లో మెస్సి గడుపనున్నారు. కోల్ కతా తర్వాత హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో కూడా పర్యటించనున్నాడు. మార్చి 14న ముంబైలో, 15న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవడంతో ఈ మెస్సీ టూర్ పర్యటన ముగుస్తుంది.
