Begin typing your search above and press return to search.

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ సందడి!

అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో సందడి రెట్టింపైంది.

By:  A.N.Kumar   |   13 Dec 2025 9:34 PM IST
ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ సందడి!
X

అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో సందడి రెట్టింపైంది. కోల్ కతాలో అర్థాంతరంగా ఆగిపోయిన పర్యటన.. అభిమానుల విధ్వంసం నడుమ హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ ఈ ఈవెంట్ ను నిర్వహించింది. దీంతో హైదరాబాద్ లో మెస్సీ ఉప్పల్ స్టేడియంలో క్రీడాకారులను అందరినీ కలిసి ముచ్చటించి ఫుట్ బాల్ మ్యాచ్ కూడా ఆడి సందడి చేయడం విశేషం. కోల్ కతా మిస్ అయిన సందడి హైదరాబాద్ లో పటిష్ట భద్రతతో అది సాకారమైంది.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెస్సీల జట్ల మధ్య స్నేహపూర్వక ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘సింగరేణి ఆర్ఆర్ టీం’ తరుఫున మైదానంలోకి దిగాడు. మెస్సీ ‘ఆపర్ణ టీమ్’ తరుఫున బరిలోకి దిగారు. తొలుత మైదానంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డికి మెస్సీ షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. ఇద్దరూ కలిసి కాసేపు ఫుట్ బాల్ ఆడారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అద్భుతంగా ఒక గోల్ కొట్టారు. దీనికి ప్రతిగా మెస్సి రెండు గోల్స్ రాబట్టారు. అనంతరం ఇరు జట్లు పెనాల్టీ షూటౌట్ లో పాల్గొన్నాయి. ఈ షూటౌట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టడంతో మెస్సీ చప్పట్లు కొట్టి ఆయన్ను అభినందించారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు మెస్సి, రేవంత్ రెడ్డి ఇరు జట్లతో కలిసి ఫొటోలు దిగారు. ఆట ముగిశాక మెస్సీ, రేవంత్ కలిసి స్టేడియంలో కలియ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. గ్యాలరీలోని అభిమానుల కోసం మెస్సీ ఫుట్ బాల్ ను కిక్ చేసి గిఫ్ట్ గా ఇచ్చారు. వీరి ఆటను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు.

ఇక కోల్ కతాలో లాగా కాకుండా ఉప్పల్ స్టేడియంలో భద్రత నడుమ ఫుట్ బాల్ స్టార్ మెస్సీ మైదానం అంతా కలియ తిరుగుతూ పిల్లలతో ఫుట్ బాల్ ఆడారు. సీఎం రేవంత్ మనవడితోనూ సరదాగా ఆడారు. రేవంత్ తన మనవడిని పరిచయం చేసి ఫుట్ బాల్ ఆడించారు. అనంతరం ముగ్గురూ కలిసి ఫొటో దిగారు. అటు ఉప్పల్ స్టేడియం అంతా మెస్సీ, మెస్సీ నినాదాలతో మార్మోగింది.

ఈ ఎగ్జిబిషన్ ఫుట్ బాల్ మ్యాచ్ ను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె కూడా వీక్షించారు.