నాగోబా జాతరలో ఈ సంప్రదాయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారంతే
ఈ జాతర ప్రధానంగా గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు నిర్వహిస్తారు.
By: Garuda Media | 20 Jan 2026 5:00 PM ISTమన దేశంలో పెద్ద ఎత్తున గిరిజన తెగలు ఉన్న విషయం తెలిసిందే. వీరికి ప్రత్యేక సంప్రదాయాలు.. పండుగలు ఉన్నప్పటికి.. కొన్నింటికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆ కోవకు చెందిందే నాగోబా జాతర. దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజన పండుగా పేరుంది. ఈ వంశీయులు ఆరాధ్య దైవం నాగోబా (శేష నారాయణమూర్తి) ను వీరెంతో నిష్టగా పూజిస్తారు.
ఈ జాతర ప్రధానంగా గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు నిర్వహిస్తారు. తెలంగాణ కేంద్రంగా జరిగే ఈ జాతరకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి కూడా ఈ వంశీయులు ప్రత్యేకంగా తరలి వస్తారు. జనవరి 18న మొదలైన ఈ జాతర ఐదు రోజుల పాటు సాగుతుంది. అంటే.. 22 వరకు సాగుతుంది. ఈ జాతర చరిత్ర ఎంతో పురాతనమైంది. వీరి వంశం నేపథ్యం.. ఆవిర్భావంలోకి వెళితే.. వీరి వంశ మూల పురుషుడిగా శేష నారాయణ మూర్తిని (నాగోబా) భావిస్తారు. వీరు గోండు తెగలోని రాజ గోండు ఉప తెగకు చెందిన వారు. మొస్రం వంశం ప్రధానంగా ఏడుగురు దేవతలను ఆరాధించే సమూహంగా పిలుస్తారు. కాలక్రమంలో మెస్రం వంశం 22 ఉప శాఖలుగా విడిపోయింది. ప్రస్తుతం ఈ వంశీయుల కుటుంబాలు 2500 వరకు ఉంటాయన్నది ఒక అంచనా.
పురాణాల ప్రకారం చూస్తే.. మెస్రం వంశానికి చెందిన పాడియోర్ అనే రాజు చేసిన తప్పునకు నాగోబా ఆగ్రహించి వారిని శిక్షించేందుకు కేస్లాపూర్ కు వచ్చాడని.. అప్పుడు మెస్రం వంశీయులు పాలు.. పెరుగు.. బెల్లం.. నెయ్యి లాంటి ఏడు రకాల నైవేధ్యాలతో నాగోబాను శాంతింపచేశారని చెబుతారు. దీంతో శాంతించిన నాగోబా అక్కడే వెలిశాడని.. దీంతో ఆ వంశీయులు తమ కులదైవంగా నాగోబాను కొలుస్తారని చెబుతారు. ఈ వంశీయులు కిక్రి అనే వాయిద్యాన్ని వాయిస్తూ తమ వంశ చరిత్రను.. నాగోబా కథను తరతరాలకు అందించటం కనిపిస్తుంది.
పూర్వ కాలం నుంచి ఈ తెగ వారు ప్రధానంగా వ్యవసాయం.. పశు పోషణ మీద ఆధారపడి జీవిస్తుంటారు.అటవీ ఉత్పత్తుల సేకరణ కూడా వీరికి జావనోపాధిలో భాగంగా ఉంటుందని చెప్పాలి. వీరు ప్రతి ఏటా ఐదు రోజుల పాటు నాగోబా జాతరను నిర్వహిస్తారు. సంప్రదాయ పూజలు నిర్వహించి.. వంశాచారాలను కాపాడటం వీరి ప్రధాన సామాజిక బాధ్యతగా చెప్పాలి. జాతర సమయంలో తమ వంశానికి చెందిన పెద్దలతో కలిసి సామాజిక సమస్యల పరిష్కారం.. వంశాచారాలకు సంబంధించిన పలు నిర్ణయాల్ని తీసుకుంటారని చెబుతారు. తెలంగాణలోని ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోనూ.. అటవీ ప్రాంతంలోనూ వీరు నివసిస్తూ ఉంటారు. వీరి వంశీయులు మహారాష్ట్ర.. ఛత్తీస్ గఢ్.. ఒడిశాలోనూ ఉన్నారు. మారిన కాలానికి తగ్గట్లు ఈ వంశీయులు చదువుల్లో రాణించి.. వివిధ ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అయినప్పటికి వీరి ఆచారాన్ని మాత్రం కొనసాగిస్తుంటారు.
ప్రతి ఏటా నిర్వహించే నాగోబా జాతర కోసం గోదావరి నుంచి నీరును తీసుకొచ్చేందుకు 150 కి.మీ. పాదయాత్ర చేస్తారు. ఎలాంటి పాదరక్షలు ధరించకుండా పాదయాత్రను నిర్వహిస్తారు. అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నుంచి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తిన మడుగు వరకు ఈ యాత్రను నిర్వహిస్తారు. గంగాజలాన్ని తీసుకొచ్చేందుకు సుమారు 1400 ఏళ్ల నాటి ప్రాచీన ఇత్తడి పాత్రను ఇందుకు ఉపయోగిస్తారు. ఈ యాత్రను అడవులు.. కొండల్లో సుమారు నలభై గ్రామాల గుండా ప్రయాణిస్తారు. ప్రయాణ సమయంలో తెల్లటి వస్త్రాలు ధరించి.. అత్యంత నిష్ఠతో వ్యవహరిస్తారు. ఇందుకోసం డిసెంబరు 30న బయలుదేరి జనవరి 7న గోదావరి వద్ద పూజలు నిర్వహించి జలాల్ని సేకరిస్తారు. ఆ తర్వాత కేస్లాపూర్ చేరుకొని.. ఆలయ ప్రాంగణలోని మర్రిచెట్టు వద్ద ఉంచుతారు. అమావాస్య అర్థరాత్రి వేళ ఈ జలంతోనే నాగోబాకు మహాపూజ.. అభిషేకం నిర్వహించి జాతరను నిర్వహిస్తారు.
ఈ జాతరలో భాగంగా మెస్రం వంశీకులు భేటింగ్ అనే సంప్రదాయాన్ని సాగిస్తారు. ఈ భేటింగ్ అంటే.. తమ తెగలో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు.. జాతరలోని భేటింగ్ లో పాల్గొని వారి వివరాల్ని వెల్లడిస్తారు. వంశ పెద్దల సమక్షంలో జరిగే ఈ భేటింగ్ తర్వాతే.. వారిని మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. అప్పుడు మాత్రమే వారికి నాగోబా ఆలయంలోకి ప్రవేశ అర్హత లభిస్తుంది. చూసేందుకు సింఫుల్ గా అనిపించినా.. వివిధ ఆటంకాల కారణంగా పెళ్లైన తర్వాత సంవత్సరాల తరబడి కూడా భేటింగ్ లో పాల్గొనే అవకాశం రాదు. అలాంటి వారు మధ్యవయస్కులైనా.. వారిని కొత్త కోడళ్లుగానే చూస్తారు. ఇదో చిత్రమైన సంప్రదాయంగా చెబుతారు.
