Begin typing your search above and press return to search.

వీరి వయసు 22 ఏళ్లు.. వీళ్ల సంస్థ విలువ రూ.80వేల కోట్లు!

అవును... అద్భుతాలు సృష్టించాలంటే బాగా చదువుకోవాల్సిన అవసరమే లేదు! ప్రధానంగా ఎవరిని వారు నమ్ముకోవాలి.. ఎంచుకునే మార్గంపై పట్టు సంపాదించాలి..

By:  Raja Ch   |   30 Nov 2025 6:00 PM IST
వీరి వయసు 22 ఏళ్లు.. వీళ్ల సంస్థ విలువ రూ.80వేల కోట్లు!
X

ముగ్గురు స్నేహితులు.. అందులో ఇద్దరు భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన కుటుంబాలకు చెందిన వారు. వీళ్ల పేర్లు.. సూర్యమిథా, ఆదర్శ్ హిరేమత్, బ్రెండెన్ పూడీ. వీళ్లు ముగ్గురు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న బెల్లార్ మెన్ కాలేజీ ప్రిపరెటరీ స్కూల్లో ఫ్రెండ్స్. అప్పటి నుంచీ వీళ్లది సక్సెస్ ఫుల్ టీమ్. స్కూల్ లో డిబేట్ పోటీలు పెడితే సూర్య - ఆదర్శ్ టీమ్ ఎప్పుడూ ముందుండేది. ఈ క్రమంలో వీరిద్దరికీ బ్రెండెన్ కూడా జత కలిశాడు.

అవును... అద్భుతాలు సృష్టించాలంటే బాగా చదువుకోవాల్సిన అవసరమే లేదు! ప్రధానంగా ఎవరిని వారు నమ్ముకోవాలి.. ఎంచుకునే మార్గంపై పట్టు సంపాదించాలి.. టీమ్ వర్క్ పై నమ్మకం పెట్టుకోవాలి. వీళ్లు ముగ్గురూ చేసింది అదే. వాస్తవానికి హైస్కూల్ చదువయ్యాక వీళ్లు ముగ్గురూ వారికి నచ్చిన కోర్సుల్లో జాయిన్ అయ్యారు. ఇందులో భాగంగా... జార్జ్ టౌన్ యూనివర్సిటీలో బ్రెండెన్ ఎకనామిక్స్ చదువుతుంటే.. అదే యూనివర్సిటీలో సూర్యామిథా ఫారిన్ సర్వీస్ కోర్సులో చేరాడు.

మరోవైపు హ్యార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్ కోర్సులో చేరాడు ఆదర్శ్. ఇలా ఎవరి అభిరుచికి తగ్గట్లు వాళ్లు కోర్సులు ఎంచుకున్నా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కచ్చితంగా భవిష్యత్తును శాసించబోతోందని మాత్రం బలంగా నమ్మారు. ఈ క్రమంలో ఒక ఏఐ స్టార్టప్ పెట్టాలని అనుకుని.. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే "మెర్కోర్" అనే సంస్థను స్థాపించారు.

ఇండియాలోని ఐటీ అభ్యర్థులకు ఆన్ లైన్ వేదికగా అమెరికాలో ఉద్యోగాలు చూపించాలన్నది ఈ స్టార్టప్ లక్ష్యం. అయితే ఇక్కడ వీరు రొటీన్ కి భిన్నంగా ఆలోచించింది ఏమిటంటే.. ఇక్కడ అభ్యర్థుల నియామకంలో మనుషులని కాకుండా ఏఐని వాడాలనుకున్నారు. ఈ సమయంలో... ఏఐ అవతార్ లే స్క్రీనింగ్ నుంచి ఇంటర్వ్యూలు, జీతాలు, అభ్యర్థులు ఏ ఉద్యోగానికి సరిపోతారు వంటి అన్ని పనులూ చక్కబెడతాయి. దీనికోసం వాళ్లు చదువు మధ్యలోనే మానేశారు!

అది రిస్క్ అని అనిపించినా... లైఫ్ లో ఏ రిస్కూ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్ అనే సిద్ధాంతాన్ని నమ్మినట్లున్నారు! ఇలా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఉద్యోగ నియామకాలను పూర్తి చేసే ఆలోచన పెట్టుబడిదారులకు బాగా నచ్చింది. ఈ నేపథ్యలోనే... ఉబర్ లాంటి కంపెనీకి నిధులు ఇచ్చి, ప్రోత్సహించిన బెంచ్ మార్క్ సంస్థ వీళ్లకీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఇదే సమయంలో.. మరికొన్ని సంస్థలూ తోడవ్వడంతో వీళ్లకు 30వేల కోట్లు అందాయి.

ఇక వాళ్లు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తాము ఎంచుకున్న మార్గంలో రిక్రూట్ మెంట్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి.. ఐదు లక్షల మంది అభ్యర్థులను స్క్రీనింగ్ చేసిన మెర్కోర్ విలువ ఇప్పుడు రూ.80 వేల కోట్లకు చేరుకుంది. దీంతో... 22 ఏళ్ల వయసులోనే వీళ్లు బిలియనీర్స్ గా ఎదిగి.. 23 ఏళ్ల వయసులో ప్రపంచంలో అత్యంత చిన్న వయస్సు బిలియనీర్ గా జుకర్ బర్గ్ పేరిట ఉన్న రికార్డును ఈ ముగ్గురూ బద్దత్లు కొట్టారు.

కేవలం 30 మంది సభ్యులు మాత్రమే ఉన్న ఈ సంస్థకి బ్రెండెన్ సీఈఓగా ఉన్నారు. ఇక ఢిల్లీ నుంచి కాలిఫోర్నియా వెళ్లి స్థిరపడిన కుటుంబానికి చెందిన సూర్యామిథా ఛైర్మన్ గా ఉన్నారు. ఇదే సమయంలో.. కర్ణాటక నుంచి వెళ్లి స్థిరపడిన కుటుంబానికి చెందిన ఆదర్శ్ సీటీవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. వీళ్ల సేవలకు రోజుల చొప్పున కాకుండా గంటల చొప్పున ఫీజుని వసూలు చేస్తున్నారు.