Begin typing your search above and press return to search.

మోడీ ఎఫెక్ట్ : అమెరికాలో మెలోనీ ‘నమస్తే’.. వైరల్

అమెరికా వైట్‌హౌస్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చేసిన చిన్న సంస్కార హావభావం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

By:  A.N.Kumar   |   19 Aug 2025 3:16 PM IST
మోడీ ఎఫెక్ట్ : అమెరికాలో మెలోనీ ‘నమస్తే’.. వైరల్
X

అమెరికా వైట్‌హౌస్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చేసిన చిన్న సంస్కార హావభావం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ‘నమస్తే’ అంటూ అధికారులను పలకరించిన ఆమె వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు “ఇది మోదీ ఎఫెక్ట్‌” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వైట్‌హౌస్‌లో మెలోనీ ప్రత్యేక శైలి

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధ పరిష్కారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌–జెలెన్‌స్కీ భేటీకి హాజరయ్యేందుకు వైట్‌హౌస్‌కు చేరుకున్న మెలోనీకి ఆతిథ్యమిచ్చిన అధికారులు ముందుగా షేక్‌హ్యాండ్స్‌తో స్వాగతం పలికారు. అయితే ఆమె కేవలం చేతులు కలపడం మాత్రమే కాకుండా భారతీయ శైలిలో రెండు చేతులు జోడించి ‘నమస్తే’ అన్నారు. ఈ హావభావం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.

- మోదీ ఎఫెక్ట్‌?

ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికలపై ‘నమస్తే’ను ప్రాధాన్యం ఇవ్వడం తెలిసిందే. కరోనా కాలంలోనూ, అధికారిక సమావేశాల్లోనూ ఆయన ‘నమస్తే’ను గౌరవప్రదంగా ఉపయోగించారు. అదే ప్రభావం మెలోనీపై పడిందని నెటిజన్లు భావిస్తున్నారు. “ఇది మోదీ ఎఫెక్ట్‌”, “ఇండియన్ కల్చర్ గ్లోబల్ లెవెల్‌లోకి వెళ్ళింది” అంటూ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- ఇది తొలిసారి కాదు

మెలోనీ ‘నమస్తే’ చెప్పడం ఇదే తొలిసారి కాదు. 2024లో ఇటలీలో జరిగిన జీ7 సమ్మిట్‌లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేర్ లేయన్‌, యూకే ప్రధాని రిషి సునాక్‌, భారత ప్రధాని మోదీలకు ఆమె నమస్కారం చేసి స్వాగతం పలికారు. ఆ వీడియో కూడా అప్పుడు విపరీతంగా వైరల్ అయ్యింది.

- గ్లోబల్ గుర్తింపు పొందుతున్న భారతీయ సంప్రదాయం

భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరుగుతోంది. ‘నమస్తే’ అనేది కేవలం అభివాదం మాత్రమే కాకుండా, “నేను నిన్ను గౌరవిస్తున్నాను” అనే అర్థాన్ని ఇచ్చే సంస్కార పద్ధతి. దీనిని మెలోనీ లాంటి అంతర్జాతీయ నేతలు అనుసరించడం భారతీయ సంస్కృతికి పెరుగుతున్న గౌరవానికి నిదర్శనం.