Begin typing your search above and press return to search.

ఛాందసవాదానికి చెక్.. భాష నుంచి బురఖా వరకు.. ఇటలీలో మెలోని సంచలనం..

మెలోని ప్రకటనలో అత్యంత చర్చనీయాంశంగా మారింది ముఖాన్ని కప్పే దుస్తుల నిషేధం.

By:  A.N.Kumar   |   21 Sept 2026 10:11 AM IST
ఛాందసవాదానికి చెక్.. భాష నుంచి బురఖా వరకు.. ఇటలీలో మెలోని సంచలనం..
X

ఇటలీ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు తెరతీసేలా ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. పాఠశాలల్లో బురఖా, నిఖాబ్ వంటి ముఖాన్ని పూర్తిగా కప్పే దుస్తులపై నిషేధం విధించడంతో పాటు.. ఒక్కో తరగతిలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు గరిష్ఠ పరిమితి పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకురానున్నట్లు మెలోని ప్రకటించారు.

మెలోని ప్రకటనలో అత్యంత చర్చనీయాంశంగా మారింది ముఖాన్ని కప్పే దుస్తుల నిషేధం. పాఠశాలకు విద్యార్థులు ముఖం కనిపించేలా రావాలని ఆమె స్పష్టం చేశారు. సంప్రదాయం లేదా ఇతర కారణాల పేరుతో ఒక యువతి తన ముఖాన్ని దాచుకోవాలని ఎవరూ నిర్ణయించలేరని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రధానంగా బురఖా, నిఖాబ్ వంటి ముఖాన్ని పూర్తిగా కప్పే దుస్తులపై దృష్టి సారించింది.

ఇక మరో కీలక అంశం విదేశీ విద్యార్థుల సంఖ్య. ఒకే తరగతిలో ఇటాలియన్ భాష తెలియని విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉంటే భాష నేర్చుకోవడం, స్థానిక విద్యా వ్యవస్థలో కలిసిపోవడం కష్టమవుతుందని మెలోని పేర్కొన్నారు. అందుకే ఒక్కో తరగతిలో ఉండే విదేశీ విద్యార్థుల సంఖ్యకు చట్టపరమైన పరిమితి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆ గరిష్ఠ సంఖ్య ఎంత అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇటలీ పాఠశాలల్లో ప్రస్తుతం సుమారు 11.6 శాతం మంది విద్యార్థులు ఇటాలియన్ పౌరులు కానివారే ఉన్నారని గణాంకాలు సూచిస్తున్నాయి.

తల్లిదండ్రులకూ ఇటాలియన్ తప్పనిసరి?

ఈ ప్రతిపాదనల్లో మరో ఆసక్తికర అంశం విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించినది. పాఠశాల వ్యవస్థలో తీవ్రంగా కలిసిపోలేకపోతున్న విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులు ఇటాలియన్ భాష నేర్చుకోవాల్సిన నిబంధనను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల విద్యా ప్రగతికి కుటుంబం కూడా భాషాపరంగా, సామాజికంగా అనుసంధానమై ఉండాలన్నది ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ఉద్దేశంగా మెలోని వివరించారు.

అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ చర్యలకు పార్లమెంట్ ఆమోదం అవసరం ఉంటుంది. ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత 60 రోజుల్లోగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి.

మెలోని ప్రభుత్వం ఇటలీ పాఠశాలలను కేవలం విద్యాబోధనకు పరిమితం చేయకుండా, భాష, సామాజిక సమీకరణం, సాంస్కృతిక నిబంధనలకు అనుగుణంగా మార్చే దిశగా కొత్త విధానాలను ప్రతిపాదిస్తోంది. అయితే విదేశీ విద్యార్థుల పరిమితి, మతపరమైన దుస్తులపై ఆంక్షలు వంటి అంశాలు అమల్లోకి వస్తే వాటిపై ఇటలీలో సామాజిక, రాజకీయ చర్చ మరింత తీవ్రం కావచ్చని అంతర్జాతీయ మీడియా విశ్లేషణలు పేర్కొంటున్నాయి.