Begin typing your search above and press return to search.

అందుకే బిల్ గేట్స్‌కు విడాకులు తీసుకున్నా.. నిజాలు బయటపెట్టిన మెలిందా

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెలిందా తన మనసులోని మాటను బయటపెట్టారు. 27 ఏళ్ల వైవాహిక బంధం ముగియడానికి బిల్ గేట్స్‌కు వివాదాస్పద వ్యక్తి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాలే ప్రధాన కారణమని ఆమె పరోక్షంగా స్పష్టం చేశారు.

By:  A.N.Kumar   |   4 Feb 2026 3:10 PM IST
అందుకే బిల్ గేట్స్‌కు విడాకులు తీసుకున్నా.. నిజాలు బయటపెట్టిన మెలిందా
X

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. ఆయన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ విడాకులు తీసుకుని మూడేళ్లు గడుస్తున్నా, వారి విడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై ఇప్పటికీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బయటకు వస్తున్న 'ఎప్‌స్టీన్ ఫైల్స్' ఈ వ్యవహారంలో పెను సంచలనాన్ని రేపుతున్నాయి.

ఆ బంధం నాకు నచ్చలేదు: మెలిందా ఆవేదన

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెలిందా తన మనసులోని మాటను బయటపెట్టారు. 27 ఏళ్ల వైవాహిక బంధం ముగియడానికి బిల్ గేట్స్‌కు వివాదాస్పద వ్యక్తి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాలే ప్రధాన కారణమని ఆమె పరోక్షంగా స్పష్టం చేశారు. "ఆ సమయం నా జీవితంలో అత్యంత బాధాకరమైనది. ఎప్‌స్టీన్ వంటి వ్యక్తులతో బిల్ గేట్స్ సంబంధాలు కొనసాగించడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఉండాల్సిన నైతిక విలువలను ఆయన పాటించలేదని నాకు అనిపించింది." అని మెలిందా పేర్కొన్నారు.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో షాకింగ్ అంశాలు

ఇటీవల విడుదలైన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌పై వచ్చిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నివేదికల ప్రకారం బిల్ గేట్స్‌కు రష్యన్ మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని.. తద్వారా ఆయన ఆరోగ్య సమస్యల బారిన పడ్డారని ఎప్‌స్టీన్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండటానికి మెలిందాకు తెలియకుండా ఆమెకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని ఎప్‌స్టీన్ సూచించినట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి.

గేట్స్ బృందం ఖండన

ఈ ఆరోపణలను బిల్ గేట్స్ ప్రతినిధులు తీవ్రంగా తోసిపుచ్చారు. ఇవన్నీ కేవలం నిరాధారమైన ఆరోపణలని ఎప్‌స్టీన్ కావాలనే ఇలాంటి అసంబద్ధమైన విషయాలను ప్రచారం చేశారని వారు స్పష్టం చేశారు. గతంలో కూడా బిల్ గేట్స్ తాను ఎప్‌స్టీన్‌ను కేవలం దాతృత్వ కార్యక్రమాల కోసమే కలిశానని.. అది తన జీవితంలో అతిపెద్ద పొరపాటని ఒప్పుకున్నారు.

2021లో విడిపోయిన ఈ జంట ప్రస్తుతం తమ స్వచ్ఛంద సంస్థ 'బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్' పనుల్లో విడివిడిగా కొనసాగుతున్నారు. అయితే ఎప్‌స్టీన్ కేసులో బాధితులకు న్యాయం జరగాలని మెలిందా డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.