Begin typing your search above and press return to search.

హంటర్‌ బైడెన్‌ , మెలానియా ట్రంప్‌ మధ్య గొడవేంటి?

హంటర్ వ్యాఖ్యలపై మెలానియా తరపు న్యాయవాది అలెజాండ్రో బిట్రో తీవ్రంగా స్పందించారు.

By:  A.N.Kumar   |   14 Aug 2025 10:00 PM IST
హంటర్‌ బైడెన్‌ , మెలానియా ట్రంప్‌ మధ్య గొడవేంటి?
X

అమెరికా రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు, ప్రతిఆరోపణలు సర్వసాధారణం. అయితే, ఇటీవల అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ మధ్య చెలరేగిన వివాదం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన పాత ఆరోపణలే.

- వివాదానికి కారణం ఏంటి?

ట్రంప్ జీవిత చరిత్రను రాస్తున్న రచయిత మైఖేల్ వోల్ఫ్ ఇటీవల ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మెలానియాను డొనాల్డ్ ట్రంప్‌కు పరిచయం చేయడంలో జెఫ్రీ ఎప్‌స్టీన్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ విషయాన్ని హంటర్ బైడెన్ కూడా పబ్లిక్‌గా ప్రస్తావించారు. వోల్ఫ్ వ్యాఖ్యలు నిజమేననే విధంగా ఆయన మాట్లాడారు. హంటర్ చేసిన ఈ వ్యాఖ్యలు మెలానియా ప్రతిష్టకు భంగం కలిగించాయని ఆమె భావించారు.

-మెలానియా లీగల్ వార్నింగ్

హంటర్ వ్యాఖ్యలపై మెలానియా తరపు న్యాయవాది అలెజాండ్రో బిట్రో తీవ్రంగా స్పందించారు. హంటర్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, మెలానియా పరువుకు నష్టం కలిగించే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హంటర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో $1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8,700 కోట్లు) పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మెలానియా ట్రంప్ తన వివరణలో ఎప్‌స్టీన్, ట్రంప్‌కు తనను పరిచయం చేశారన్న ఆరోపణలను ఖండించారు. తాను, ట్రంప్ న్యూయార్క్‌లోని కిట్‌కాట్ క్లబ్‌లో కలిశామని, అప్పటికి ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేశారు.

-రాజకీయ కోణంలో వివాదం

ఈ వివాదం కేవలం వ్యక్తిగత పరువు సమస్యగా చూడలేము. ఇది ట్రంప్, బైడెన్ కుటుంబాల మధ్య రాజకీయ పోరులో భాగంగానూ విశ్లేషకులు భావిస్తున్నారు. హంటర్ బైడెన్ చేసిన ఆరోపణలు, మెలానియా లీగల్ వార్నింగ్‌కు ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం ఈ వివాదాన్ని మరింత పెంచుతోంది. ఈ ఘటనలు రాబోయే ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ వివాదం కేవలం ఒక గాసిప్‌తో ముగుస్తుందా, లేదా నిజంగానే కోర్టు కేసుగా మారుతుందా అన్నది చూడాలి. కానీ, అమెరికా రాజకీయాల్లో ఎల్లప్పుడూ వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయని ఈ ఉదాహరణ మరోసారి రుజువు చేసింది.