రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసిన మెలానియా ట్రంప్.. ఎలా సాధ్యమైందంటే?
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ప్రపంచదేశాలు, అగ్రరాజ్యాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరి వల్ల కానిది..
By: A.N.Kumar | 25 Oct 2026 12:52 PM ISTకరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ప్రపంచదేశాలు, అగ్రరాజ్యాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరి వల్ల కానిది.. ఆఖరుకు ట్రంప్ బట్టలు చింపుకొని అధికారంలోకి వచ్చిన వారంలో యుద్ధం ఆపేస్తానన్న ఆగని వినని ఆ రెండు దేశాలను ఒప్పించి మెప్పించి కాల్పుల విరమణకు అంగీకరింపచేసి యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు ట్రంప్ సతీమణి మెలానియా. ఇంత మందితో కానిది మెలానియాతో ఎలా సాధ్యమైంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ ప్రశ్న.
యుద్ధం మొదలుపెట్టడమే నీచేతుల్లో ఉంటుంది.. ముగించడం ఎవరి చేతుల్లో ఉండదు. ఇప్పుడు నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ తలొగ్గి లొంగిపోయి యుద్ధాన్ని ఆపేసింది కాబట్టి సరిపోయింది. కానీ రష్యా ఎంత కొట్టినా ఉక్రెయిన్ దెబ్బకు దెబ్బ తీస్తూ యుద్ధాన్ని నాలుగేళ్లకు పైగా నడిపిస్తోంది. ఈ యుద్ధంలో అపార ధన, ప్రాణ నష్టాలు సంభవించాయి.. ట్రంప్ చెప్పినా.. మోడీ కలుగజేసుకున్నా ఈ రెండూ దేశాలు తగ్గకుండా యుద్ధోన్మాదాన్ని పెచ్చరిల్లేలా చేస్తూనే ఉన్నాయి. ఏ యుద్ధానికి ఎక్కడో ఒకచోట పుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు కొంచెం విరామం లభించింది.
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక ఊహించని.. కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఎన్నో రోజులుగా రక్తపాతం, తీవ్ర ఉద్రిక్తతల నడుమ నలిగిపోతున్న ఇరు దేశాలు చివరికి తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. వేలాది మంది ప్రాణాలను బలిగొంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ ఘర్షణకు తాత్కాలికంగానైనా విరామం లభించడం పట్ల అంతర్జాతీయ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.
మెలానియా ట్రంప్ చొరవతో కుదిరిన ఒప్పందం
ఈ కీలక పరిణామం వెనుక అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సాగించిన దౌత్య ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం ఆమె ప్రత్యేక చొరవ చూపి.. ఇరు వర్గాలతో జరిపిన సంప్రదింపులు ఫలించాయి. ఉక్రెయిన్లోని కీలక ప్రాంతమైన ‘ఒలెష్కీ’లో తాత్కాలికంగా కాల్పులు విరమించేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు ఒక ఒప్పందానికి వచ్చారు. యుద్ధ క్షేత్రంలో నలిగిపోతున్న స్థానిక ప్రజలకు తక్షణ ఉపశమనం అందించేందుకు.. మానవతా దృక్పథంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది.
మెలానియా దౌత్యంపై డోనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం
తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంలో తన సతీమణి మెలానియా వహించిన పాత్రపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత సంతోషం వ్యక్తం చేశారు. మెలానియా దౌత్య నైపుణ్యాన్ని కొనియాడుతూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. "మా వద్ద ఉన్న అంతర్జాతీయ దౌత్య నిపుణుల కంటే మెలానియానే అత్యద్భుతంగా పనిచేస్తోంది. శాంతి స్థాపన దిశగా ఆమె చేసిన ప్రయత్నాలు, చూపిన చొరవ అభినందనీయం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. క్లిష్టమైన అంతర్జాతీయ సంక్షోభంలో మెలానియా సాధించిన ఈ విజయాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
అంతర్జాతీయంగా ఆశల చిగురింపు
ఒలెష్కీ ప్రాంతంలో కుదిరిన ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం.. రాబోయే రోజుల్లో రష్యా, ఉక్రెయిన్ల మధ్య పూర్తిస్థాయి శాంతి చర్చలకు దారితీస్తుందా అనే ఆశలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. యుద్ధ జ్వాలలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ పరిణామం కొంత ఊరటనివ్వడమే కాకుండా... దౌత్య మార్గాల ద్వారా సంక్షోభ పరిష్కారానికి కొత్త ద్వారాలు తెరవాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
