మెకెదాటు ఎఫెక్ట్: కాంగ్రెస్ నేతల మధ్య కయ్యం!
కావేరి నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకెదాటు రిజర్వాయర్ ప్రాజెక్టుపై వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రాజెక్టును ఎవరూ ఆపలేరని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించగా, తమిళనాడు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ విమర్శలు గుప్పించారు. బెంగళూరుకు తాగునీరు, విద్యుత్ అవసరాల కోసం 67.16 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని కర్ణాటక భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుతో కావేరి జలాల్లో తమ వాటాకు నష్టం జరుగుతుందని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతల మధ్యే ఈ అంశంపై విభేదాలు బయటపడ్డాయి.
By: Garuda Media | 16 Nov 2026 1:59 AM IST'మేకెదాటు..' కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఒక బహుళార్థసాధక రిజర్వాయర్. కన్నడంలో 'మేకెదాటు' అంటే 'మేక దూకే చోటు' అని అర్థం. కర్ణాటకలోని రామనగర (బెంగళూరు సౌత్) జిల్లాలో, తమిళనాడు సరిహద్దుకు సమీపంలో కావేరి, అర్కావతి నదులు కలిసే లోతైన లోయ ప్రాంతంలో దీనిని నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే.. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే.. తమిళనాడు ప్రాంతాలకు నీరు అందదని, దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నది తమిళ నేతల వాదన. దీంతో దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదం కొనసాగుతోంది. అయితే.. తాజాగా రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతల మధ్య చోటు చేసుకున్న ఈ మెకెదాటు వ్యవహారం రచ్చకెక్కింది.
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. 'నారాష్ట్రం-నా హక్కు. ఈ ప్రాజెక్టును ఎవరూ ఆపలేరు' అని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ఇంచార్జ్, ఎంపీ మాణిక్కం ఠాకూర్ కూడా గట్టిగా బదులిచ్చారు. `నీది మొండి వైఖరి` అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో ఒకప్పుడు వేర్వేరు పార్టీల మధ్య జరిగిన ఈ మెకదాటు వ్యవహారం.. ఇప్పుడు ఒకే పార్టీ అందునా రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య జరగడం ఆసక్తిగా మారింది.
కర్ణాటక వాదన ఇదీ..
సుమారు 67.16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించాలని కర్ణాటక భావిస్తోంది. బెంగళూరు నగరానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీర్చడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాకాలంలో సముద్రంలోకి వృథాగా పోయే మిగులు నీటిని మాత్రమే ఇందులో నిల్వ చేస్తామని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమిళనాడుకు దక్కాల్సిన వాటాకు ఎలాంటి ఆటంకం కలగదని కర్ణాటక వాదిస్తోంది.
తమిళనాడు అభ్యంతరం
దిగువ రాష్ట్రమైన తమ అనుమతి లేకుండా ఎగువన కర్ణాటక కొత్త డ్యామ్ కట్టడం చట్టవిరుద్ధమని తమిళనాడు వాదిస్తోంది. ఈ డ్యామ్ నిర్మిస్తే వర్షాభావ పరిస్థితుల్లో తమిళనాడులోని కావేరి డెల్టా రైతులకు సాగునీరు అందక ఎడారిగా మారే ప్రమాదం ఉందని భయపడుతోంది. ఈ క్రమంలో కావేరి జలవివాద ట్రైబ్యునల్ తీర్పులకు ఇది విరుద్ధమని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది.
తాజా రచ్చ..
ప్రధాని మోడీ రెండు రోజుల కిందట బెంగళూరులో పర్యటించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని మోడీ సమక్షం లోనే ఈ ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు వేగంగా ఇవ్వాలని కోరారు. "మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు, మా రాష్ట్రంలో డ్యామ్ కట్టుకునే హక్కు మాకుంది" అంటూ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. ఈ వివాదం ఇప్పుడు సొంత పార్టీ నేతల మధ్యే చిచ్చు రేపింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. డీకే శివకుమార్ వ్యాఖ్యలను తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. అయితే..తనను ఎవరూ ఆపలేరని డీకే సవాల్ రువ్వారు. మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.
