జగన్ 'ఓల్డ్' ఫ్రెండ్స్ నుంచి ఎందుకీ కామెంట్స్?
ఇప్పుడు అదే పద్ధతిలో జగన్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడమే ఎవరికీ అంతుచిక్కడం లేదు.
By: Tupaki Political Desk | 3 Nov 2025 9:00 PM ISTమాజీ సీఎం జగన్మోహనరెడ్డి చుట్టూ చేరిన వారి భజన వల్ల జరుగుతున్న నష్టంపై వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మాజీ సీఎం జగన్ కు గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందిన మేకపాటి పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన కుటుంబం పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా రాజమోహనరెడ్డి కుమారుడు దివంగత గౌతంరెడ్డి మాజీ సీఎం జగన్ కు స్నేహితుడు. దీంతో రాజమోహనరెడ్డి కుటుంబంతో జగన్ కు అత్యంత సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. జగన్ మంచి కోరుకునే వారిలో ముందుండే రాజమోహనరెడ్డి తాజా వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.
చుట్టూ ఉన్న నేతలు భజన చేయడం వల్ల పొంగిపోతున్న మాజీ సీఎం జగన్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని మాజీ ఎంపీ మేకపాటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కూడా గతంలో ఇవే తరహా కామెంట్లు చేసి పార్టీకి దూరమయ్యారు. ఒకప్పుడు అంటే జగన్ వైసీపీని స్థాపించే సమయంలో విజయసాయిరెడ్డి, రాజమోహనరెడ్డి ఆయనకు కుడి, ఎడమ భుజాలుగా పనిచేశారని చెబుతున్నారు. అంతేకాకుండా ఏ విషయంలో అయినా మాజీ సీఎం జగన్ ను సమర్థించడానికి వెనుకా ముందు ఆలోచించేవారు కాదని కూడా గుర్తుచేస్తున్నారు. అలాంటి వారు ఇప్పుడు అధినేతను తప్పుపట్టే పరిస్థితికి వెళ్లడమే వైసీపీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వైసీపీలో నెంబరు టు నాయకుడిగా పనిచేసిన విజయసాయిరెడ్డి పార్టీ వ్యవహారాలలో అత్యంత కీలకంగా చెబుతారు. జగన్ తర్వాత ఆయన సర్వాధికారాలు చలాయించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ఆయనకు చెక్ చెప్పగా, అధికారం కోల్పోయిన కొద్దిరోజులకే అధినేతకు దూరమయ్యారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, అందువల్లే పార్టీ ఓడిపోయిందని విమర్శలు చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే పద్ధతిలో జగన్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడమే ఎవరికీ అంతుచిక్కడం లేదు.
పార్టీ శ్రేయస్సు కోరే ఆయన ఇలా మాట్లాడారా? లేక ఇంకేమైనా ఆలోచన ఉందా? అనే చర్చ జరుగుతోంది. మేకపాటి సోదరుడు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం గతంలో మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే మాజీ ఎంపీ మేకపాటికి పార్టీ మారే ఆలోచన లేకపోయినా, పార్టీ వ్యవహారంపై ఆయనలో అసంతృప్తి నెలకొందనే విషయం తాజా కామెంట్ల బట్టి అర్థమవుతోందని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 2011లో పార్టీ పెట్టినప్పుడు జగన్ పక్కన ఉన్నవారు ఎవరూ ఇప్పుడు ఆయన వద్ద లేరని రాజమోహనరెడ్డి అభిప్రాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
2009లో కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన జగన్ తో జట్టుకట్టిన వారిలో విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి ప్రముఖులు. అదేవిధంగా జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ వంటి వారు పార్టీ ఏర్పాటులో క్రియాశీలంగా పనిచేశారు. అయితే ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి తప్ప మరెవరూ జగన్ పక్కన కనిపించడం లేదని గుర్తు చేస్తున్నారు. మేకపాటి పార్టీలో ఉన్నప్పటికీ వృద్ధాప్యం కారణంగా చురుకైన పాత్ర పోషించలేకపోతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ చుట్టు భజనపై మాజీ ఎంపీ చేసిన కామెంట్లు హీట్ పుట్టిస్తున్నాయి. దీనిపై ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
