జగన్ మీద ఎందుకు కోపమొచ్చిందో...మేకపాటి వ్యాఖ్యలు
ఇక జగన్ అయిదేళ్ళ పాలనలో ఎవరూ చేయని ఎన్నో మంచి పనులు చేసి చూపించారు అని మేకపాటి గుర్తు చేశారు. సచివాలయాల వ్యవస్థను జగన్ తెచ్చి పాలనను గుమ్మంలోకి నిలిపాడు అన్నారు.
By: Satya P | 5 March 2026 8:15 AM ISTవైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన నాలుగు దశాబ్దాల క్రితమే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా ఉంటూ అనేక సార్లు ఎమ్మెల్యే ఎంపీగా గెలిచారు. వైసీపీలో పునాదుల నుంచి ఉంటూ వచ్చిన మేకపాటి ఆ పార్టీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. తమ కుమారుడు గౌతం రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చారు. ఆయన జగన్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నెరిపారు. గౌతం రెడ్డి అకాల మరణంతో మరో కుమారుడు విక్రం రెడ్డిని బరిలోకి దించారు. అలా ఆత్మకూరు నుంచి ఉప ఎన్నికల్లో విక్రం రెడ్డి గెలిచారు అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీకి నెల్లూరు జిల్లా పెద్ద దెబ్బ కొట్టింది.
టోటల్ గా స్వీప్ :
నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లు ఎంపీతో సహా అన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి. వైసీపీకి ఒక్కటంటే ఒక్క సీటు దక్కలేదు. 2024 లో మొత్తం సీట్లు గెలుచుకున్న వైసీపీ అయిదేళ్ళు తిరిగేసరికల్లా ఘోర పరాజయం మూటకట్టుకుంది. కేలక నేతలు అంతా తెర వెనకకు పోయారు. ఇక వైసీపీ నుంచి బిగ్ షాట్స్ అంతా పార్టీని వీడిపోయారు వర్గ పోరు సామాజిక వర్గ సమీకరణలలో తేడాలు ఆధిపత్యాలు అన్నీ కలసి వైసీపీని ఓడించాయి.
ఎందుకు ఓడించారో అంటూ :
ఇదిలా ఉంటే ఆంతకూరులో జరిగిన ఒక సమావేశంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ మీద తమ కుటుంబం మీద ప్రజలకు ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదని వాపోయారు. తాము ఏనాడు ప్రభుత్వం తరఫున పైసాను అయినా తాకలేదని అన్నారు. అంతే కాదు తాము కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి తిరిగి ప్రజలకు పెట్టామని అన్నారు. తాము ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశామని అయినా ఓడించారు అని ఆవేదన వ్యక్తం చేసారు.
జగన్ విషయంలో అంతే :
ఇక జగన్ అయిదేళ్ళ పాలనలో ఎవరూ చేయని ఎన్నో మంచి పనులు చేసి చూపించారు అని మేకపాటి గుర్తు చేశారు. సచివాలయాల వ్యవస్థను జగన్ తెచ్చి పాలనను గుమ్మంలోకి నిలిపాడు అన్నారు. మేజర్ పోర్టులు మైనర్ పోరుట్లు అన్నీ కలిపి పదుల సంఖ్యలో నిర్మాణం ప్రారంభించారు అని గుర్తు చేశారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చారని కొన్ని పూర్తి చేసారని అన్నారు. సంక్షేమ కార్యక్రామాలను తుచ తప్పకుండా అమలు చేశారని అన్నారు. అయినా జగన్ మీద ఎందుకు జనాలకు కోపం వచ్చిందో ఓడించారు అని మేకపాటి అన్నారు.
ప్రజలు ఆలోచించాలి :
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆలోచించాలని ఆయన హితవు చెప్పారు. ఎవేరేమిటి అని అంచనా వేసుకోవాలని హామీలు ఇచ్చినా నెరవేర్చని తీరులో కూటమి పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం హామీలు ఇస్తారని తీరా వచ్చాక వాటిని పక్కన పెడతారు అని మేకపాటి మండిపడ్డారు. ప్రజలు పూర్తిగా అన్నీ గమనించాలని ఆయన కోరారు.
అవినీతి మచ్చ లేనిది :
తాము అవినీతి మచ్చ లేని కుటుంబంగా ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణా ఏపీ మొత్తం మీద అలా అవినీతి లేని రాజకీయ కుటుంబాలు పది ఇరవై కంటే ఎక్కువ ఉండవని అన్నారు. ఆ ఫ్యామిలీలలో తాము తప్పనిసరిగా ఉంటామని అన్నారు. ప్రజలు వాస్తవాలు అర్ధం చేసుకోవాలని ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. మొత్తం మీద వైసీపీ దిగ్గజ నేతలు ఓటమి బాధ నుంచి ఇంకా కోలుకోలేదని మేకపాటి తాజా వ్యాఖ్యలతో అర్ధం అవుతోంది. మరి ఆయన కోరినట్లుగా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారా లేదా అన్నది ముందు ముందు తేలనుంది.
