Begin typing your search above and press return to search.

892 కి.మీ. మెగా ఫ్లాష్... రికార్డ్ సృష్టించిన "మెరుపు" దాడి తెలుసా?

వాతావరణ అల్లకల్లోలం వల్ల కణాలు ఢీకొని విద్యుత్ చార్జ్‌ ను ఉత్పత్తి చేసినప్పుడు 'మెరుపు' సంభవిస్తుందనే సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   1 Aug 2025 7:00 AM IST
892 కి.మీ. మెగా ఫ్లాష్... రికార్డ్  సృష్టించిన మెరుపు దాడి తెలుసా?
X

వాతావరణ అల్లకల్లోలం వల్ల కణాలు ఢీకొని విద్యుత్ చార్జ్‌ ను ఉత్పత్తి చేసినప్పుడు 'మెరుపు' సంభవిస్తుందనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో అది ఆకాశం అంతటా మిలియన్ల వోల్ట్‌ లను ఉత్పత్తి చేస్తుంది. అయితే... చాలా మెరుపులు చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా 16 కిలోమీటర్లు (10 మైళ్లు) కంటే తక్కువ పొడవు ఉంటాయి. ఇవి వర్షాకాలంలోనే కాకుండా అప్పుడప్పుడూ కాస్త ఎక్కువ వర్షాలు కురిసినప్పుడూ రెగ్యులర్ గా కనిపిస్తుంటూనే ఉంటాయి.

ఇవి తరచుగా నిలువుగా కనిపిస్తుంటాయి.. అప్పుడప్పుడూ మేఘాల గుండా అడ్డంగానూ ప్రయాణించగలవు. ఈ క్రమంలో... ఒక మెరుపు 100 కిలోమీటర్ల (62 మైళ్లు) పొడవును దాటితే మాత్రం దానిని "మెగా ఫ్లాష్‌"గా వర్గీకరిస్తారు. ఇలాంటి మెగా ఫ్లాష్ మెరుపులు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. అలాంటిది 892 కిలోమీటర్ల (515 మైళ్లు) పొడవు మెరుపు సంభవిస్తే అది ఎలా ఉంటుంది? తాజాగా దీనికి సంబంధించిన విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) వెల్లడించింది.

అవును... 29 ఏప్రిల్ 2020లో దక్షిణ యునైటెడ్ స్టేట్స్‌ లోని కొన్ని ప్రాంతాలలో భారీ మెరుపు సంభవించింది. దీంతో ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపుగా ఇది రికార్డులకెక్కింది. ఇది ఉత్తర అమెరికాలోని గ్రేట్ ప్లెయిన్స్ అంతటా 768 కిలోమీటర్లు (477 మైళ్లు) విస్తరించగా... ఈ రికార్డును బద్దలు కొట్టే మెగాఫ్లాష్ ఒకటి 2017 అక్టోబర్‌ లో సంభవించిందని.. ఇది పాత రికార్డు కంటే 61 కిలోమీటర్లు (38 మైళ్లు) ఎక్కువ అని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది.

ఇది టెక్సాస్ నుండి కాన్సాస్ వరకు విస్తరించింది. ఇది యూరప్‌ లోని పారిస్ – వెనిస్ మధ్య దూరానికి సమానం కాగా... ఆ దూరాన్ని కవర్ చేయడానికి కారుకు ఎనిమిది నుండి తొమ్మిది గంటలు.. విమానానికి కనీసం 90 నిమిషాలు పడుతుంది. గురువారం ఈ ఆవిష్కరణను ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇది 892 కిలోమీటర్ల (515 మైళ్లు) పొడవు మెరుపని తెలిపింది.

వాస్తవానికి సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ మెరుపు దాడి జరిగినప్పటికీ.. ఇది ఇటీవలే కనుగొనబడిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రపంచ వాతావరణ సంస్థ, అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన భౌగోళిక శాస్త్రవేత్త రాండీ సెర్వేనీ... దీనిని మెగాఫ్లాష్ మెరుపు అని పిలుస్తామని.. అది ఎలా, ఎందుకు సంభవిస్తుందనే దాని మెకానిక్‌ లను తాము ఇప్పుడే కనుగొంటున్నామని తెలిపారు.