Begin typing your search above and press return to search.

వీర్యంతో నెలకు రూ.5 లక్షల సంపాదన.. ఏమిటీ స్పెషల్!

అన్మోల్ సాధారణ గేదె కాదు. దాని విలువ నమ్మశక్యం కాని స్థాయిలో అన్నట్లుగా అక్షరాలా రూ. 23 కోట్లు.

By:  Raja Ch   |   2 Nov 2025 2:09 PM IST
వీర్యంతో నెలకు రూ.5 లక్షల సంపాదన.. ఏమిటీ స్పెషల్!
X

హర్యానాకు చెందిన అన్మోల్ అనే గేదె మరోసారి ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. 1,500 కిలోగ్రాముల బరువు, రూ. 23 కోట్ల విలువైన ఈ భారీ జంతువు ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టినీ ఆకర్షించడంలో ఎప్పుడూ విఫలం కావడంలేదు. ఈ క్రమంలో... ఇటీవల ప్రసిద్ధ పుష్కర్ మేళాలో అన్మోల్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అవును... అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 5 వరకు కొనసాగే ఈ ప్రసిద్ధ పుష్కర్ మేళా ప్రదర్శనలో గత కొన్ని సంవత్సరాలుగా లెక్కలేనన్ని జంతువులను ప్రదర్శించారు.. కానీ, ఈసారి అన్మోల్ మాత్రం అత్యంత ప్రత్యేకంగా నిలిచింది.

అన్మోల్ సాధారణ గేదె కాదు. దాని విలువ నమ్మశక్యం కాని స్థాయిలో అన్నట్లుగా అక్షరాలా రూ. 23 కోట్లు. ఆ మొత్తంతో రెండు రోల్స్ రాయిస్ కార్లు, పది మెర్సిడెస్ బెంజ్ వాహనాలు లేదా అనేక భారతీయ నగరాల్లో మంచి ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు! దీంతో... ఈ భారీ గేదె సంతలోకి అడుగుపెట్టగానే అందరి కళ్ళు సహజంగానే దాని వైపు మళ్లాయి.

ఈ అన్మోల్ కు ఎనిమిది సంవత్సరాలు కాగా.. ఇది హర్యానాలోని సిర్సా జిల్లా నుండి వచ్చింది. దీని అందం మాత్రమే కాదు, పశువుల పెంపకానికి ఉపయోగించే అధిక నాణ్యత వీర్యం కోసం డిమాండ్ కూడా దాన్ని మరింత విలువైనదిగా చేస్తుంది. ఇందులో భాగంగా... దాని యజమాని దీని వీర్యం ద్వారా ప్రతి నెలా సుమారు సుమారు రూ. 5 లక్షలు సంపాదిస్తున్నాడని చెబుతున్నారు.

అన్మోల్ ను పెంచడం అంత తేలికైన పని కాదు. దాని రోజువారీ సంరక్షణకు సుమారు రూ. 1,500 ఖర్చవుతుందని చెబుతున్నారు. దీనికి ప్రతిరోజూ 250 గ్రాముల బాదం, 4 కిలోల దానిమ్మ, 30 అరటిపండ్లు, 5 లీటర్ల పాలు, 20 గుడ్లు తినిపిస్తారట. దానితో పాటు నెయ్యి, సోయాబీన్స్, మొక్కజొన్న, ఆయిల్ కేక్, తాజా పచ్చి మేత తింటుందట.

కాగా.. అన్మోల్ తల్లి అధిక దిగుబడినిచ్చే గేదె. అది ప్రతిరోజూ 25 లీటర్ల పాలు ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందింది. గత సంవత్సరం మీరట్‌ లో జరిగిన అఖిల భారత రైతు ఉత్సవంలో అన్మోల్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు పుష్కర్ మేళాలో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది.