Begin typing your search above and press return to search.

ఆడియో లీక్ తో హైదరాబాద్ ఎస్ఐ లిక్కర్ బాటిళ్ల కక్కుర్తి బయటకు!

తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటమే అతడికి శాపమైంది.

By:  Garuda Media   |   13 April 2026 10:23 AM IST
ఆడియో లీక్ తో హైదరాబాద్ ఎస్ఐ లిక్కర్ బాటిళ్ల కక్కుర్తి బయటకు!
X

తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటమే అతడికి శాపమైంది. ఓవైపు తన స్థలం కబ్జా అయ్యిందన్న మానసిక క్షోభ సరిపోనట్లుగా.. ఎస్ఐ మద్యం బాటిళ్ల కక్కుర్తి అతడ్ని మరింత ఇబ్బందికి గురి చేసింది. అయితే.. సదరు కక్కుర్తి ఎస్ఐ ఫోన్ ఆడియో కాల్ లీక్ కావటంతో సదరు పోలీసు అధికారి పాపం పండింది. హైదరాబాద్ మహానగర పరిధిలోని ఒక ఎస్ఐ కక్కుర్తి ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటమే పాపమా? ఫిర్యాదుదారుడికి ఇంతలా చుక్కలు చూపుతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

మీర్ పేట లెనిన్ నగర్ కు చెందిన తిరుపతయ్య భార్య లత పేరు మీద ఆమె అత్త పదకొండు గజాల స్థలాన్ని 2010లో గిఫ్ట్ డీడ్ చేశారు. అందులో తిరుపతయ్య షెట్టర్ వేసుకొని సెలూన్ నడిపిస్తున్నాడు. ఆ స్థలాన్ని గతంలో తిరుపతయ్య అత్తకు అమ్మిన వెంకటేశ్.. ఈ నెల నాలుగున షాప్ ను అక్రమించి.. నిర్మాణం చేపట్టటంతో మీర్ పేట పోలీస్ స్టేషన్ లోనూ.. బడంగ్ పేట సర్కిల్ కార్యాలయంలోనూ తిరుపతయ్య కంప్లైంట్ చేశాడు.

ఈ ఫిర్యాదుకు స్పందించిన మీర్ పేట ఎస్ఐ నాగభూషణం నిర్మాణ స్థలాన్ని పరిశీలించి.. పనులు నిలిపివేయాలని ఆదేశించినా.. వెంకటేశ్ మాత్రం స్పందించలేదు. దీనిపై తిరుపతయ్య పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇదిలా ఉండగా.. తిరుపతయ్యకు ఎస్ఐ ఫోన్ చేసి అర్జెంట్ గా రెండు మద్యం బాటిళ్లు పంపాలని కోరాడు. తాను ఊళ్లో లేనని తిరుపతయ్య చెప్పగా.. పిల్లలు ఎవరితో అయినా పంపాలని ఒత్తిడి చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో కాల్ లీక్ కావటం.. ఇది కాస్తా వైరల్ కావటంతో విషయం ఉన్నతాధికారులకు చేరింది. దీంతో.. సీరియస్ అయిన ఉన్నతాధికారులు ఎస్ఐను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉదంతం ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.