Begin typing your search above and press return to search.

వైద్య వృత్తి.. వద్దు బాబోయ్.. అసలు కారణాలు తెలిస్తే షాక్!

ఒకప్పుడు 'వైద్యో నారాయణో హరిః' అంటూ దైవంతో సమానంగా పూజలందుకున్న డాక్టర్లే ఇప్పుడు తమ వృత్తి వద్దని ఆవేదన చెందుతున్నారు.

By:  Madhu Reddy   |   3 March 2026 11:53 AM IST
వైద్య వృత్తి.. వద్దు బాబోయ్.. అసలు కారణాలు తెలిస్తే షాక్!
X

ఒకప్పుడు 'వైద్యో నారాయణో హరిః' అంటూ దైవంతో సమానంగా పూజలందుకున్న డాక్టర్లే ఇప్పుడు తమ వృత్తి వద్దని ఆవేదన చెందుతున్నారు. తాజాగా జరిగిన ఓ సర్వేలో 91 శాతం మంది వైద్యులు తమ పిల్లలు ఈ రంగానికి రావద్దని కోరుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విపరీతమైన పని ఒత్తిడి, రోగుల బంధువుల దాడులు, ఆర్థిక అనిశ్చితి మధ్య నలుగుతున్న ప్రాణదాతల నిజ జీవిత గాధలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..

చదువుకే సగం జీవితం.. సెటిల్ అయ్యేది ఎప్పుడు:

సాధారణంగా ఏ వృత్తిలోనైనా 25 ఏళ్ల వయసుకే స్థిరపడి సంపాదన మొదలుపెడతారు. కానీ, ఒక డాక్టర్ పూర్తిస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎంబీబీఎస్, పీజీ అంటూ కనీసం 35 ఏళ్లు వచ్చే వరకు పుస్తకాలతోనే యుద్ధం చేయాలి. ఇక తోటి స్నేహితులు సాఫ్ట్‌వేర్ రంగంలో లక్షల జీతాలు తీసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే, వైద్యులు మాత్రం తెల్లవార్లు హాస్పిటల్ వార్డుల్లో, ప్రాక్టికల్స్ మధ్య కాలం గడిపేస్తున్నారు. ఇక ఈ సుదీర్ఘమైన నిరీక్షణ వారిలో తీవ్రమైన మానసిక వేదన, మెంటల్ టార్చర్ మిగులుస్తోంది. జీవితంలో సగం కాలం కేవలం చదువుకే కేటాయించడం వల్ల వ్యక్తిగత సుఖాలకు, కుటుంబానికి దూరమవుతున్నామని ఎక్కువ మంది డాక్టర్లు వాపోతున్నారు.

కోట్లలో ఫీజులు.. అప్పుల ఊబిలో కెరీర్:

వైద్య విద్య ఇప్పుడు సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి విద్యార్థులు పీజీ సీటు కోసం ప్రైవేట్ కాలేజీల్లో కోట్లకు పైగా ఫీజులు కట్టాల్సి రావడం పెను భారంగా మారింది. ఇక బ్యాంక్ లోన్లు తీసుకుని చదివిన వారు కెరీర్ ప్రారంభంలోనే అప్పుల టెన్షన్ అనుభవిస్తున్నారు. ఇంత ఖర్చు చేసి, ఇన్నేళ్లు కష్టపడినా చివరకు వచ్చే జీతం లేదా ప్రాక్టీస్ ద్వారా వచ్చే ఆదాయం పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. దీనికి తోడు 67 శాతం మంది డాక్టర్లు మెడికో లీగల్ కేసుల భయంతో నిరంతరం ఒత్తిడికి లోనవుతూ, మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోతున్నారు.

ప్రాణదాతలపై దాడులు.. భయం నీడలో విధులు:

సేవ చేయాలనే తపనతో ఆస్పత్రికి వెళ్లే వైద్యులకు ఇప్పుడు భద్రత కరువైంది. సర్వేలో తేలిన షాకింగ్ విషయం ఏమిటంటే, సుమారు 84 శాతం మంది డాక్టర్లు రోగుల బంధువుల చేతిలో అవమానాలు ఎదురవుతాయనే భయంతోనే డ్యూటీ చేస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా లేదా రోగి పరిస్థితి విషమించినా వెంటనే డాక్టర్లపై దాడులు చేయడం, ఆస్పత్రులను ధ్వంసం చేయడం కామన్ గా మారింది. అహోరాత్రులు శ్రమించినా దక్కేది అవమానాలేనని వారు ఆవేదన చెందుతున్నారు. అందుకే, ఇంతటి రిస్క్ ఉన్న వృత్తిలోకి తమ పిల్లలను పంపి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేయలేమని వైద్యులే తెగేసి చెబుతున్నారు.