అదృష్టం అంటే ఇదే.. లక్కీ డ్రాలో 53 లక్షల ఫార్చ్యూన్ కారు దక్కించుకున్న నాలుగేళ్ల బాలుడు!
అదృష్టం అనేది ఎప్పుడు.. ఎలా.. ఎవరి తలుపుతడుతుందో చెప్పలేం. ముఖ్యంగా అదృష్టం పట్టడానికి వయసుతో కూడా సంబంధం లేదు అంటూ సరిగ్గా నిరూపించాడు నాలుగేళ్ల కుర్రాడు.
By: Madhu Reddy | 9 Oct 2025 12:36 PM ISTఅదృష్టం అనేది ఎప్పుడు.. ఎలా.. ఎవరి తలుపుతడుతుందో చెప్పలేం. ముఖ్యంగా అదృష్టం పట్టడానికి వయసుతో కూడా సంబంధం లేదు అంటూ సరిగ్గా నిరూపించాడు నాలుగేళ్ల కుర్రాడు. ఎలా అంటే తన అదృష్టంతో ఏకంగా 53 లక్షల టయోటా ఫార్చ్యూన్ కారును సొంతం చేసుకున్నారు. మరి ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది.. ? అసలు ఆ బాలుడు అంత విలువైన లగ్జరీ కార్ దక్కించుకోవడం వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బర్హన్ పూర్ జిల్లా శిలాంపుర ప్రాంతంలో చోటుచేసుకుంది. కేవలం రూ.201 తో లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేస్తే వారికి ఊహించని రీతిలో బహుమతి లభించింది. అసలు విషయంలోకి వెళ్తే.. దసరా సందర్భంగా బర్హన్ పూర్ లోని అభాపురి ప్రాంతంలో సర్కార్ ధామ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గర్భ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున స్థానికులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లక్కీ డ్రా కూపన్ స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే శిలాంపూర్ కి చెందిన కిరణ్ రాయిక్వార్ అనే మహిళ తన నాలుగు సంవత్సరాల మనవడు మేధాన్ష్ పేరుతో రూ.201 చెల్లించి ఒక కూపన్ కొనుగోలు చేసింది. మరుసటి రోజు నిర్వహించిన లక్కీ డ్రాలో మేధాన్ష్ పేరు ఉన్న కూపన్ విజేతగా నిలిచింది.
అయితే బహుమతిగా రూ.53 లక్షల విలువైన టయోటా ఫార్చునర్ ఎస్ యు వి దక్కడంతో ఆ కుటుంబం ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఏది ఏమైనా 201 లక్కీ డ్రా తో ఏకంగా 53 లక్షల విలువైన లగ్జరీ కారు దొరకడం అంటే మామూలు విషయం కాదు.. అదృష్టం అంటే ఈ పిల్లాడిదే.. లక్కీ బాయ్ అంటూ స్థానికులే కాదు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లక్కీ డ్రాలో లగ్జరీ కార్ ను బహుమతిగా గెలుచుకున్న కిరణ్ రాయిక్వార్ మాట్లాడుతూ.. "నా మనవడు మేధాన్ష్ కి చిన్నప్పటి నుంచి ఈ బొమ్మల కార్లు అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ కూడా వాటినే అడుగుతాడు. అయితే ఈసారి అతనికి నిజమైన అతిపెద్ద కారు లభించింది. ఇది దేవుడి వరమే అని మేము భావిస్తున్నాము. పేపర్ వర్క్ పూర్తయిన తర్వాత ఆ కార్ మా ఇంటికి వస్తుంది" అంటూ సంతోషం వ్యక్తం చేశారు కిరణ్.
వాస్తవానికి మధ్యప్రదేశ్లో లాటరీలపై నిషేధం ఉంది. కానీ సాంస్కృతిక లేదా ధార్మిక ఉత్సవాల సందర్భంలో నిర్వహించే లక్కీ డ్రాలపై మాత్రం ఎలాంటి షరతులు లేవు. అవి పన్ను చెల్లింపులతో పారదర్శకంగా నిర్వహిస్తే చట్టపరంగా అనుమతించబడతాయి కూడా.. అయితే ఈసారి దసరా సందర్భంగా నిర్వహించిన గర్భ ఉత్సవం కూడా స్థానిక అధికారుల అనుమతితోనే జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేసారు మేధాన్ష్. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
