ప్రేమ పెళ్లిళ్లకు అడ్డాగా మేడ్చల్
ఆసక్తికర అధ్యయనం ఒకటి తాజాగా వెలుగు చూసింది. తెలంగాణలో అత్యధికంగా ప్రేమ పెళ్లిళ్లు జరిగే టాప్ త్రీ జిల్లాల వివరాలు వెలుగు చూశాయి.
By: Garuda Media | 24 Sept 2025 12:00 PM ISTఆసక్తికర అధ్యయనం ఒకటి తాజాగా వెలుగు చూసింది. తెలంగాణలో అత్యధికంగా ప్రేమ పెళ్లిళ్లు జరిగే టాప్ త్రీ జిల్లాల వివరాలు వెలుగు చూశాయి. గడిచిన ఐదేళ్లలో ఈ జిల్లాల్లో ప్రేమ పెళ్లిళ్లు పెరగటమే కానీ తగ్గేది ఉండని వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఈ విషయంలో టాప్ వన్ స్థానంలో నిలిచిన జిల్లా మరేదో కాదు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. ఐటీ కంపెనీలకు.. విద్యా సంస్థలకు నిలయంగా ఉన్న ఈ జిల్లా ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే అత్యధిక ప్రేమ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విషయం తాజాగా వెలుగు చూసింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఏడాది నాలుగు వేల ప్రేమ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంటే.. ఒక్క మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోనే వెయ్యికి పైగా ఉండటం విశేషం. దీనికి కారణం.. ఈ జిల్లాలోనే అత్యధికంగా మెడికల్.. ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు అనేక ప్రైవేటు ఇన్ స్టిట్యూట్లు.. స్టాఫ్ వేర్ కంపెనీలు ఈ ప్రాంతంలో కొలువు తీరిన విషయం తెలిసిందే. దీంతో పాటు వేలాది హాస్టళ్లు కూడా ఉన్నాయి. దీంతో.. మనసులు కలవటం.. అవి పెళ్లిళ్ల వరకు వెళుతున్నాయి.
మేడ్చల్ జల్లాలో 2020-21లో 984 ప్రేమ పెళ్లిళ్లు జరగ్గా.. ఆ తర్వాతి నుంచి ప్రతి ఏడాది వరుసగా 1149, 1196, 1168, 1102 ప్రేమ పెళ్లిళ్లు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తర్వాత అత్యధికంగా ప్రేమ పెళ్లిళ్లు నమోదు అవుతున్నది రంగారెడ్డి జిల్లాలోనే. ఈ జిల్లాలోనూ ఐటీ కంపెనీలు.. ఐటీ సంస్థలు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. పలు విద్యా సంస్థలు కూడా ఈ జిల్లాలో భాగమే. ఐదేళ్లలో 339, 446, 539, 661, 652 ప్రేమ పెళ్లిళ్లు రిజిస్ట్రేషన్లు అయినట్లుగా రికార్డు చెబుతున్నాయి. మూడో స్థానంలో వరంగల్ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 2020లో 412 ప్రేమ పెళ్లిళ్లు జరగ్గా.. 2024-25లో 647 ప్రేమ పెళ్లిళ్లు రిజిస్ట్ర్ అయ్యాయి.
