Begin typing your search above and press return to search.

రూ.50కి బకెట్ వేడి నీళ్లు.. కుంభమేళా రిపీట్ అవుతోంది..

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర భక్తి పారవశ్యంతో ముంచెత్తుతోంది.

By:  A.N.Kumar   |   17 Jan 2026 8:30 AM IST
రూ.50కి బకెట్ వేడి నీళ్లు.. కుంభమేళా రిపీట్ అవుతోంది..
X

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర భక్తి పారవశ్యంతో ముంచెత్తుతోంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకలో ఆధ్యాత్మికతతో పాటు సరికొత్త వ్యాపార ధోరణులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గడ్డకట్టే చలిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న భక్తుల కోసం స్థానికులు "బకెట్ వేడి నీళ్లు" కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చారు.

చలి పులిని ఎదుర్కొనేందుకు..

ప్రస్తుతం మేడారం అడవుల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంది. తెల్లవారుజామునే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం భక్తులకు కష్టంగా మారింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు చల్లటి నీటిలో స్నానం చేయడానికి జంకుతున్నారు. ఈ సమస్యను గమనించిన స్థానికులు, జాతర పరిసరాల్లో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నీటిని కాచుతున్నారు.

బకెట్ రూ. 50.. లాభాలు వేలల్లో!

గతంలో కుంభమేళాలో పళ్లపుల్లల నుండి చిన్న చిన్న వస్తువుల వరకు విక్రయించడం చూశాం. ఇప్పుడు మేడారంలోనూ అదే తరహాలో ఉపాధి మార్గాలు పుట్టుకొచ్చాయి. ఒక్కో బకెట్ వేడి నీళ్లకు రూ. 50 వసూలు చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుండే భక్తులు క్యూ కడుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో బకెట్లు విక్రయిస్తూ ఒక్కో నిర్వాహకుడు వేలల్లో సంపాదిస్తున్నారు.

భక్తులకు సౌకర్యం.. స్థానికులకు ఉపాధి

ఈ సీజనల్ వ్యాపారంపై భక్తులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. "వాగులో చల్లటి నీటిలో స్నానం చేయడం కష్టంగా ఉంది. 50 రూపాయలు అయినా సరే వేడి నీళ్లు దొరకడం వల్ల ఆరోగ్యం పాడవకుండా ఉంటుందని భావిస్తున్నాం" అని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.

మేడారం జాతర కేవలం మొక్కులు చెల్లించుకోవడానికే కాదు, ఇలాంటి వినూత్న ఆలోచనలతో స్థానిక గిరిజనులకు, పేదలకు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తోంది. భక్తి, వ్యాపారం, ఉపాధి మేళవింపుతో మేడారం జనసంద్రంగా మారుతోంది.