సోషల్ మీడియాలో వీడియో మాదిరే ఈ రియల్ స్టోరీ
మెదక్ జిల్లా తూప్రాన్ మండలానికి చెందిన సుజాత దంపతులు తమకున్న అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఉద్దేశంతో మేడ్చల్ జిల్లా కౌకూర్ దర్గాకు వెళ్లాడు.
By: Garuda Media | 4 Aug 2026 11:04 AM ISTసోషల్ మీడియాలో వచ్చే కొన్ని రీల్స్ ను తలపించే ఉదంతంగా దీన్ని చెప్పాలి. నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పటం.. టార్గెట్ చేసి మరీ ముగ్గులోకి దించటం.. చివరకు మోసం చేయటం లాంటివి చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి ఉదంతం ఒకటి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. చెప్పే మాటల్ని విన్నంతనే అయ్యో పాపం అనేలా గుండెలు కరిగించే మాటలు చెప్పటం.. వారి మాటల్ని విని సానుకూలంగా స్పందిస్తే చాలు.. జీవితాన్ని బొగ్గు చేయటానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఆ కోవకే చెందుతాడు హేమంత్. అతడి దుర్మార్గాల గురించి చెబితే అవాక్కు అవ్వాల్సిందే.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలానికి చెందిన సుజాత దంపతులు తమకున్న అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఉద్దేశంతో మేడ్చల్ జిల్లా కౌకూర్ దర్గాకు వెళ్లాడు. ఈ సందర్భంగా వారికి పరిచయమయ్యాడు హేమంత్. తనకు తాను అనాధగా చెప్పుకొని.. తనకు ఎవరూ లేరని వాపోయాడు. దీంతో.. అయ్యో అని జాలిపడిన ఆ కుటుంబం అతడ్ని దగ్గరకు తీసుకుంది.
దర్గాకు వెళ్లే దారిలో పరిచయమైన హేమంత్.. ఏకంగా వారి ఇంటికి వచ్చి.. అక్కడే ఉండటం మొదలు పెట్టాడు. ఆ కుటుంబంతో దగ్గరగా మసులుకుంటూ వారి రెండో కుమార్తెకు లవ్ పేరుతో దగ్గరయ్యాడు. ఇద్దరికి గత ఏడాది మేలో తూప్రాన్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో పెళ్లి చేశారు. అయితే.. హేమంత్ ప్రవర్తన మీద భార్యకు సందేహం కలిగింది. తరచూ అతను పని పేరుతో మియాపూర్ కు వెళ్లటంతో అనుమానం వచ్చిన ఆమె.. అతడి కదలికలపై నిఘా పెట్టింది.
ఇందులో భాగంగా హేమంత్ ఫోన్ ను రహస్యంగా చెక్ చేసింది. అందులో పలువురు మహిళలతో అతను అసభ్యంగా గడిపిన వీడియోల్ని గుర్తించింది. దీంతో అతడ్ని నిలదీయటంతో.. హేమంత్ ఊరు వదిలి పారిపోయాడు. తాజాగా మళ్లీ ఊరికి రావటంతో.. బాధితురాలు పంచాయితీ పెట్టింది. దీంతో గ్రామస్తుల్ని అతడ్ని తీవ్రంగా కొట్టారు. నువ్వు ఎవరు? ఎక్కడ ఉంటావు? ఏం చేస్తుంటావు? లాంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ దాడి చేయటంతో అతడి అబద్ధాల పుట్ట పగిలింది.
తాను అనాథను కాదని.. తనకంటూ ఒక కుటుంబం ఉందని చెప్పటమే కాదు.. తన పేరు హేమంత్ కాదని.. నాజర్ అని చెప్పటమే కాదు.. తన మతం వేరన్న షాకింగ్ నిజాన్ని వెల్లడించాడు. తనకు తల్లి.. తమ్ముడు ఉంటారన్న అతను.. తల్లి కీసరలో ఉంటే.. తమ్ముడు గుంటూరులో ఉంటాడన్న విషయాన్ని వెల్లడించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి ఫోన్ ను స్వాధీనం చేసుకొని అతడి డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదంతా చూస్తే.. సోషల్ మీడియాలో తరచూ కనిపించే రీల్స్ స్టోరీ మాదిరి ఈ ఉదంతం ఉందని చెప్పక తప్పదు. అందుకే.. కొత్తవారితో బీకేర్ ఫుల్.
